
న్యూఢిల్లీ: అప్‌కమింగ్ ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్‌గా విరాట్ కోహ్లీనే ఉండాలని టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ అన్నాడు. కోహ్లీ మళ్లీ సారథ్య బాధ్యతలు చేపడితే ఆర్‌సీబీకి కలసొస్తుందని అభిప్రాయపడ్డాడు. గతేడాది ఐపీఎల్ 2021 సీజన్ పూర్తయిన వెంటనే విరాట్ కోహ్లీ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
దీంతో వచ్చే సీజన్ కోసం ఆర్‌సీబీ కొత్త కెప్టెన్‌ను తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ వీకెండ్‌లో జరిగే మెగా వేలంలో కెప్టెన్‌ను ఎంచుకోవాలని ఆ ఫ్రాంచైజీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌తో మాట్లాడిన అజిత్ అగార్కర్.. కెప్టెన్ కోసం వేలంలో డబ్బులు ఖర్చు చేసుకోవడం అసవరమని తెలిపాడు.
'విరాట్ కోహ్లీ మళ్లీ సంతోషంగా ఆ జట్టు పగ్గాలు అందుకోవడానికి సిద్ధంగా ఉంటే ఆర్‌సీబీకి అదే మంచిది. దాంతో వాళ్ల పని తేలికవుతుంది. బెంగళూరు ఫ్రాంఛైజీ కొన్నేళ్లుగా సరైన కోర్ జట్టును కొనుగోలు చేసేందుకు తగినంత మొత్తం వెచ్చించలేదని మనందరికీ తెలిసిందే. ఆ జట్టు ఎప్పుడూ టాప్ 3 ఆటగాళ్లపైనే ఆధారపడింది. మిడిలార్డర్‌లో సరైన ఆటగాళ్లను తీసుకోలేకపోయింది. ఇప్పుడు కూడా ఆ జట్టు వద్ద తగినంత సొమ్ము లేకపోతే ఒక్క ఆటగాడి కోసం భారీ మొత్తం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అతడెంత మేటి ఆటగాడైనా మ్యాచ్‌లు గెలిపిస్తాడు కానీ.. టైటిళ్లు అందించలేడు' అని అగార్కర్ స్పష్టం చేశాడు.
రిటెన్షన్ ప్రక్రియలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(రూ.15 కోట్లు), విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్(రూ.11 కోట్లు), మహమ్మద్ సిరాజ్(రూ.7 కోట్లు) ముగ్గురు ఆటగాళ్లనే తీసుకున్న బెంగళూరు రూ. 33 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఈ లెక్కన ఆర్‌సీబీ దగ్గర రూ.57 కోట్లు పర్స్ మనీ ఉంది. ఈ డబ్బుతో బెంగళూరు వేలంలో మంచి ఆటగాళ్లను టార్గెట్ చేయవచ్చు. కెప్టెన్సీ కోసం శ్రేయస్ అయ్యర్, జాసన్ హోల్డర్, డేవిడ్ వార్నర్ వంటి స్టార్ ఆటగాళ్లను ఆర్‌సీబీ కట్టడి చేసింది. అయితే కోహ్లీనే మళ్లీ సారథ్య బాధ్యతలు చేపడితే ఆర్‌సీబీకి వేలంలో కలిసొస్తుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.