IPL 2022: ముంబై ఇండియన్స్ ఈ సారి టైటిల్ గెలవదు.. మూడు బలమైన కారణాలు ఇవే!

హైదరాబాద్: ఐపీఎల్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్ టీమ్ ఏదైనా ఉందా.. అంటే? అది ముంబై ఇండియన్సే. ఆ జట్టు సాధించిన ఐదు టైటిల్సే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. బెస్ట్ కెప్టెన్‌తో పాటు టాప్ క్లాస్ బౌలర్లు.. సూపర్ బ్యాటర్లు.. అంతకు మించిన మేనేజ్‌మెంట్ ఆ టీమ్ సొంతం. ఈ లెక్కనే ప్రతీ సీజన్‌లో ఆ జట్టు హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతూ ఇప్పటికే 5 టైటిల్స్ గెలిచింది.
కానీ ఈ సారి మాత్రం ఆ జట్టు పరిస్థితి భిన్నంగా ఉంది. మెగావేలంలో ఆ జట్టు టాప్-3 టీమ్స్ అంచనాలను అందుకోలేకపోయింది. గతానికి భిన్నంగా ఆటగాళ్ల కోసం కోట్లు తగలేసిన ముంబై.. బలహీనంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఓ మూడు కారణాలు ఆ జట్టు చాంపియన్ కాలేదనే విషయాన్ని చెబుతున్నాయి. అవెంటో ఓ లుక్కెద్దాం.

బౌలింగ్‌లో ఆ క్వాలిటీ మిస్..
గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగం జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, నాథన్ కౌల్టర్ నైల్, రాహుల్ చాహల్, కృనాల్ పాండ్యాలతో పటిష్టంగా కనిపించింది. కానీ ఈ సారి ఆ క్వాలిటి మిస్సయ్యింది. బుమ్రాకు తోడుగా మరో స్థార్ పేసర్ లేడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ మిస్సయ్యాడు. బుమ్రా, జయదేవ్ ఉనాద్కత్, డానియల్ సామ్స్, మయాంక్ మార్కండే, టైమల్ మిల్స్ ఈ సారి ముంబై బౌలింగ్ విభాగాన్ని నడిపించనున్నారు. అనుభవలేమితో పాటు క్వాలిటీ లేకపోవడం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
పైగా గ్రూప్ సిస్టమ్ పుణ్యమా ముంబై.. బలమైన జట్లతోనే ఎక్కువ మ్యాచ్‌లు ఆడనుంది. బౌల్ట్ స్థానంలో జోఫ్రా ఆర్చర్‌ను తీసుకున్నా.. అతను ఈ సీజన్‌కు దూరంగా ఉన్నాడు. దాంతో బుమ్రాకు తోడుగా మరో క్వాలిటీ పేసర్ అందుబాటులో లేకుండా పోయాడు. జయదేవ్ ఉనాద్కత్.. ఇప్పటి వరకు ఆన్ అండ్ ఆఫ్ పెర్ఫామెన్సే కనబర్చగా.. మిల్స్, డానియల్ సామ్స్, రిలే మెరిడిత్ తమను నిరూపించుకోలేదు. స్పిన్నర్లలో కూడా కృనాల్, చాహర్ లాంటి బౌలర్లు కూడా లేరు. అంతగా అనుభవం లేని మయాంక్, మురుగన్ అశ్విన్ ఏ మేరకు రాణిస్తారో చూడాలి.

బలహీనంగా మిడిలార్డర్..
ఇక గతంలో మాదిరి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ కూడా ముంబై ఇండియన్స్‌కు లేదు. ముఖ్యంగా మిడిలార్డర్ బలహీనంగా కనిపిస్తోంది. పాండ్యా బ్రదర్స్ స్థానంలో టీమ్ డేవిడ్, ఫిన్ అలెన్‌లను తీసుకున్నా.. సౌరభ్ తివారీ వంటి దేశవాళీ స్టార్లు మిస్సయ్యారు. వేలంలో అధిక ధర పలికిన ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. గత సీజన్‌లో అతనికి ప్రత్యామ్నాయంగా సౌరభ్ తివారీ ఉండేవాడు. కానీ ఈ సారి అతని ఫిట్‌నెస్, వయసు దృష్ట్యా ముంబై కొనుగోలు చేయలేదు. అన్‌మోల్ ప్రీత్ సింగ్, హైదరాబాద్‌కు చెందిన తిలక్ వర్మలపైనే ఆ జట్టు ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్లేయర్స్ వర్క్‌లోడ్ బిగ్ చాలెంజ్..
ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లు ప్రపంచకప్ జట్టులో భాగం కానున్నారు. రోహిత్, బుమ్రా అన్ని ఫార్మాట్లు ఆడుతున్న ఆటగాళ్లు. ఇప్పటికే తీరిక లేకుండా చాలా క్రికెట్ ఆడారు. ఈ నేపథ్యంలో వారికి గాయాలు అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది.
ఇప్పటికే బీసీసీఐ ప్రపంచకప్ ఆడే ఆటగాళ్లపై ప్రత్యేక శ్రద్దపెట్టింది. ఈ క్రమంలోనే స్టార్ ఆటగాళ్లకు ఒకటి, రెండు మ్యాచ్‌లకు విశ్రాంతి కల్పించినా ముంబైకి కష్టాలు తప్పవు. గత సీజన్ ఫస్టాఫ్‌లో అద్భుతంగా రాణించిన ముంబై.. సెకండాఫ్‌లో రోహిత్, హార్దిక్ పాండ్యా దూరమవడంతో వరుస ఓటములు చవిచూసింది. ఈ లెక్కనే ఈ సారి కూడా అలాంటి పరిస్థితులే రిపీట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications