
ఓపెనర్లపైనే భారం..
చెన్నై సూపర్ కింగ్స్ సాధించిన 9 విజయాల్లో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కీలక పాత్ర పోషించాడు. అతనికి మరో ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ అండగా నిలిచాడు. ప్రతీ మ్యాచ్‌లో ఈ జోడీ జట్టుకు మంచి శుభారంభాలను అందించింది. ముఖ్యంగా సెకండాఫ్ లీగ్‌లో రుతురాజ్ దుమ్మురేపాడు. నిలకడైన ప్రదర్శనతో జట్టుకు ఒంటిచేత్తో విజయాలందించాడు. యూఏఈ గడ్డపై అతను వరుసగా 88 నాటౌట్, 38, 40, 45, 101 నాటౌట్, 13, 12 రన్స్‌తో మొత్తం 14 మ్యాచ్‌ల్లో 533 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు 6 హాఫ్ సెంచరీలున్నాయి.
మరోవైపు డూప్లెసిస్ 14 మ్యాచ్‌ల్లో 546 రన్స్ చేశాడు. ఈ ఇద్దరి సూపర్ ఇన్నింగ్స్‌లకు చివర్లో జడేజా మెరుపులు మెరిపించడంతో బ్యాటింగ్‌లో చెన్నై బలహీనతలు బయటపడలేదు. కానీ గత రెండు మ్యాచ్‌ల్లో గైక్వాడ్ విఫలమవడంతో ఆ జట్టు బ్యాటింగ్ బలహీనతలు తెలుసొచ్చాయి. ఈ యువ ఆటగాడిపై టీమ్ ఏ విధంగా ఆధారపడుతుందోననే విషయం అర్థమైంది.

మిడిలార్డర్ వైఫల్యం..
ఓపెనర్ల శుభారంభం, జడేజా సూపర్ ఫినిషింగ్‌తో చెన్నై నెట్టుకొచ్చింది. అయితే ఆ జట్టు మిడిలార్డర్ దారుణంగా విఫలమైంది. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేసిన మోయిన్ అలీ అడపా దడపా ఇన్నింగ్స్‌లు ఆడినా భారీ స్కోర్లు చేయలేకపోయాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సురేశ్ రైనా దారుణంగా విఫలమయ్యాడు. భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్‌లో ఓ హాఫ్ సెంచరీ బాదిన అతను.. సెకండాఫ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. 12 మ్యాచ్‌ల్లో కేవలం 160 పరుగులే చేసి జట్టులో చోటు కోల్పోయాడు.
సెకండాఫ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై బ్యాట్స్‌మెన్ వైఫల్యం స్పష్టంగా తెలుసొచ్చింది. రుతురాజ్ ఒక్కడే సెంచరీ చేసిన వేళ మిగతా బ్యాట్స్‌మన్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. అనంతరం భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ సులువుగా చేధించింది. అప్పుడే చెన్నై బ్యాట్స్‌మన్ ఇంకా మెరుగ్గా ఆడాల్సింది అనే అభిప్రాయం వ్యక్తమైంది.

ధోనీ టెస్ట్ ఇన్నింగ్స్..
ఇక కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జట్టుకు భారంగా తయారయ్యాడు. తన స్మార్ట్ కెప్టెన్సీ, కీపింగ్‌తో జట్టును ముందుకు తీసుకెళ్తున్నా.. బ్యాటింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. టీ20 క్రికెట్‌లో టెస్ట్ తరహా బ్యాటింగ్‌తో చికాకు తెప్పిస్తున్నాడు. ఓపెనర్ల సూపర్ బ్యాటింగ్‌తో ధోనీకి పెద్దగా అవకాశాలు రాకపోయినా.. వచ్చినవాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. భారీ షాట్లు ఆడలేక సతమతమవుతున్నాడు.
యువ స్పిన్నర్ల గూగ్లీని రీడ్ చేయలేకపోతున్నాడు. సెకండాఫ్‌లో ఏడు మ్యాచ్‌లో 6సార్లు బ్యాటింగ్ వచ్చిన ధోనీ.. 3, 11 నాటౌట్, 1, 14 నాటౌట్, 18, 12 పరుగులతో దారుణంగా విఫలమ్యాడు. 14 మ్యాచ్‌ల్లో కేవలం 96 రన్స్ మాత్రమే చేశాడు. ధోనీ మునపటి ఫామ్ కనబర్చకపోతే ప్లే ఆఫ్స్‌లో చెన్నై విజయం సాధించడం కష్టమే.

బౌలింగ్ లుకలుకలు
గత మూడు ఓటములతో చెన్నై బౌలింగ్ లుకలుకలు కూడా బయటపడ్డాయి. ముఖ్యంగా ఆ జట్టు ప్రధాన పేసర్ దీపక్ చాహర్ వైఫల్యం టీమ్ విజయాలపై ప్రభావం చూపింది. గత మూడు మ్యాచ్‌ల్లో అతను (0/32), (1/34), (1/48) ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. పవర్ ప్లేలో పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీయడం అతని శైలి. కానీ గత మూడు మ్యాచ్‌ల్లో అతను టీమ్ ప్రణాళికలకు అనుగుణంగా రాణించడంలో విఫలమయ్యాడు.
స్పిన్నర్లు రవీంద్ర జడేజా, మొయిన్ అలీలు సైతం పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఇతర జట్ల స్పిన్నర్లలా వికెట్లు తీయలేకపోతున్నాడు. శార్దూల్ ఠాకూర్ ఒక్కడే జట్టుకు కావాల్సిన వికెట్లు అందిస్తున్నాడు. డ్వేన్ బ్రావో కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ.. గాయాల కారణంగా జట్టుకు పూర్తిస్థాయి సేవలందించలేకపోతున్నాడు. ఈ వైఫల్యం ప్లే ఆఫ్స్‌లో కొనసాగితే సీఎస్‌కే ముందు అడుగు వేయడం కష్టం.

గాయాల బెడద
ఇక చెన్నై సూపర్ కింగ్స్‌ను ప్రధానంగా వేధిస్తున్న మరో సమస్య గాయాల బెడద. స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ గాయంతోనే తుది జట్టుకు దూరమయ్యాడు. సురేశ్ రైనా కూడా ఈ జాబితాలో చేరాడు. ఇప్పటికే డ్వేన్ బ్రావో గాయాలతోనే సావాసం చేస్తూ బరిలోకి దిగుతున్నాడు. సురేశ్ రైనా స్థానంలో జట్టులోకి తీసుకొచ్చిన రాబిన్ ఊతప్ప ఎక్కడ ఆడించాలనేది కూడా టీమ్‌మేనేజ్‌మెంట్‌కు అర్థం కావడం లేదు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అతను దారుణంగా విఫలమయ్యాడు. గాయాల కారణంగా చెన్నై సరైన కాంబినేషన్‌తో బరిలోకి దిగడం లేదు. ఈ సమస్యలన్నీ అధిగమిస్తేనే చెన్నై టైటిల్ సాధించగలదు.


Click it and Unblock the Notifications
