
గెలిచింది ఒక్కటే..
ఏడు మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆరెంజ్ ఆర్మీ.. ప్లే ఆఫ్స్ చేరడం కష్టం. అద్భుతం జరిగితే తప్పా ఇది సాధ్యం కాదు. సెకండాఫ్‌లో ఏడు మ్యాచ్‌లకు ఏడు గెలిస్తేనే టోర్నీలో ముందడుగేసే పరిస్థితి. లేకుంటే మెరుగైన రన్‌రేట్‌తో 6 మ్యాచ్‌లోనైనా గెలవాలి. కానీ జట్టు ప్రస్తుత పరిస్థితి చూస్తే అది సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఫస్టాఫ్‌లో పంజాబ్ కింగ్స్‌పై గెలిచిన ఆరెంజ్ ఆర్మీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో సూపర్ ఓవర్‌లో ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ ఓడిన అన్ని మ్యాచ్‌లు సునాయసంగా గెలిచేవే. కానీ బలహీనమైన మిడిలార్డర్, పేలవ బ్యాటింగ్‌తో గెలిచే మ్యాచ్‌లను చేజార్చుకుంది.

ప్లే ఆఫ్స్ కష్టమే..
డేవిడ్ వార్నర్ పేలవ ఫామ్‌లో జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపడంతో 6 మ్యాచ్‌ల తర్వాత కెప్టెన్‌గా అతనిపై వేటు వేసిన హైదరాబాద్ టీమ్‌మేనేజ్‌మెంట్.. నూతన సారథిగా కేన్ విలియమ్సన్‌ను నియమించింది. వార్నర్‌ను తుది జట్టులో నుంచి కూడా తప్పించింది. ఇక కేన్ సారథ్యంలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన సన్‌రైజర్స్.. రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడింది. ఆ తర్వాత కరోనా లీగ్ వాయిదా పడింది.
నటరాజన్ గాయంతో తప్పుకోవడంతో జట్టు బౌలింగ్ కూడా బలహీనపడింది. ఇక కొత్తగా జట్టులోకి వచ్చిన షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్ తుది జట్టులో ఆడటం కష్టమే. ఎందుకంటే నలుగురు విదేశీ కోటాలో ఇప్పటికే కెప్టెన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్, రషీద్ ఖాన్‌ను తప్పక ఆడించాల్సిన పరిస్థితి. నాలుగో ప్లేస్ కోసం ఆల్‌రౌండర్లు జాసన్ హోల్డర్, మహమ్మద్ నబీ పోటీపడుతున్నారు.

సన్‌రైజర్స్ షెడ్యూల్..
ఢిల్లీ క్యాపిటల్స్‌తో సెప్టెంబర్ 22న దుబాయ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరబాద్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత షార్జాలో పంజాబ్ కింగ్స్, దుబాయ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.
| మ్యాచ్ వివరాలు | తేదీ | టైమ్ | వేదిక |
| హైదరాబాద్ X ఢిల్లీ | సెప్టెంబర్ 22 | రాత్రి 7.30 | దుబాయ్ |
| హైదరాబాద్ X పంజాబ్ | సెప్టెంబర్ 25 | రాత్రి 7.30 | షార్జా |
| హైదరాబాద్ X రాజస్థాన్ | సెప్టెంబర్ 27 | రాత్రి 7.30 | దుబాయ్ |
| హైదరాబాద్ X చెన్నై | సెప్టెంబర్ 30 | రాత్రి 7.30 | షార్జా |
| హైదరాబాద్ X కోల్‌కతా | అక్టోబర్ 3 | రాత్రి 7.30 | దుబాయ్ |
| హైదరాబాద్ X ఆర్‌సీబీ | అక్టోబర్ 6 | రాత్రి 7.30 | అబుదాబి |
| హైదరాబాద్ X ముంబై | అక్టోబర్ 8 | సాయంత్రం 3.30 | అబుదాబి |

సన్‌రైజర్స్ బెస్ట్ ఎలెవన్
బెయిర్ స్టో గైర్హాజరీ నేపథ్యంలో డేవిడ్ వార్నర్, వృద్దిమాన్ సాహా ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత కెప్టెన్ విలియమ్సన్, మనీశ్ పాండే, విజయ్ శంకర్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేయనున్నారు. ఆరో స్థానంలో ఆల్‌రౌండర్ల జాసన్ హోల్డర్, మహమ్మద్ నబీలకు అవకాశం దక్కవచ్చు. పరిస్థితులకు అనుగుణంగా ఈ ఇద్దరిలో ఒకరిని తీసుకోవచ్చు. ఏడో స్థానంలో హిట్టింగ్ సామర్థ్యం గల అబ్దులు సమద్‌కు అవకాశం దక్కవచ్చు.
అతనికి హిట్టింగ్ రోల్‌నే ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఏకైక స్పిన్నర్‌గా అఫ్గాన్ సెన్సేషన్ రషీద్‌ఖాన్ బరిలోకి దిగనున్నాడు. ఇక భువనేశ్వర్ కుమార్, నటరాజన్‌తో కలిసి పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. మూడో పేసర్‌గా సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, సిద్దార్ట్ కౌల్‌లో ఒకరికి అవకాశం దక్కడం ఖాయం. ఎవరు ఫామ్‌లో ఉంటే వారు తుది జట్టులో ఉంటారు.

తుది జట్టు(అంచనా)
డేవిడ్ వార్నర్, వృద్దిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, మనీశ్ పాండే, విజయ్ శంకర్, జాసన్ హోల్డర్/ మహమ్మద్ నబీ, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్/ఖలీల్/ సిద్దార్థ్ కౌల్, టీ నటరాజన్

దూకుడుగా ఆడితేనే..
రషీద్ ఖాన్ జట్టుకు X ఫ్యాక్టర్ ఆటగాడు కానున్నాడు. అతను వేసే నాలుగు ఓవర్లే జట్టుకు కీలకం కానున్నాయి. ఇక బ్యాటింగ్‌లో దూకుడుగా ఆడితేనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అవకాశాలుంటాయి. గతేడాది యూఏఈ సెకండాఫ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపింది. అదే జోరును ఈ ఏడాది కూడా కొనసాగించాలి. ముఖ్యంగా ఆల్‌రౌండర్లు రాణించడం చాలా ముఖ్యం. నబీ, జాసన్ హోల్డర్‌ను పిచ్ పరిస్థితుల ఆధారంగా తీసుకోవాలి. యువ ఆటగాళ్లతో ప్రయోగం చేసి చేతులు కాల్చుకోవడం కంటే అనుభవానికి ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యం.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు
కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్, అభిషేక్ శర్మ, బసిల్ థంపి, భువనేశ్వర్ కుమార్, మనీశ్ పాండే, మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, షాబాజ్ నదీమ్, శ్రీవాత్స్ గోస్వామి, సిద్దార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్, టీ నటరాజన్, విజయ్ శంకర్, వృద్దిమాన్ సాహా, విరాట్ సింగ్, ప్రియమ్ గార్గ్, మిచెల్ మార్ష్, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, కేదార్ జాదవ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, జగదీష్ సుచిత్, షెర్ఫెన్ రుథర్‌ఫోర్డ్


Click it and Unblock the Notifications












