
కోల్‌కతా: ఐపీఎల్ 2021 సెకండాఫ్ ముంగిట జట్టులో ఏర్పడ్డ ఖాళీలను ఫ్రాంచైజీలు భర్తీ చేస్తున్నాయి. ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ స్థానంలో న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీని కోల్‌కతా నైట్‌రైడర్స్ తీసుకుంది. వ్యక్తిగత కారణాలతో యూఏఈలో జరుగనున్న ఐపీఎల్ మిగతా మ్యాచ్‌లకు కమిన్స్ దూరం కావడంతో అతని లోటును సౌథీతో భర్తీ చేసింది. గతంలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబైయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల తరఫున ఆడిన సౌథీ.. కోల్‌కతాకు అదనపు బలం అవుతాడని ఆ జట్టు కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ ఆశాభావం వ్యక్తంజేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 305 మ్యాచ్‌ల్లో 603 వికెట్లు తీసిన సౌథీ.. కమిన్స్ స్థానాన్ని భర్తీ చేస్తాడన్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 40 మ్యాచ్‌లు ఆడిన టిమ్ సౌథీ..8.73 ఎకనామితో 28 వికెట్లు తీశాడు. 2019లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున చివరిసారిగా ఆడాడు.
ఇక పంజాబ్ కింగ్స్ ఇంగ్లండ్ క్రికెటర్ ఆదిల్ రషీద్‌ను తీసుకుంది. ఆస్ట్రేలియా యువ పేసర్ జై రిచర్డ్‌సన్ సెకండాఫ్ లీగ్ నుంచి తప్పుకోవడంతో అతని స్థానాన్ని ఇంగ్లండ్ స్పిన్నర్‌తో భర్తీ చేసింది. ఇప్పటికే రిలే మెరిడిత్ స్థానంలో నేథన్ ఎల్లీస్‌ను ఆ జట్టు తీసుకుంది. బెంగళూరు, రాజస్థాన్ జట్లు కూడా ఖాళీల్ని భర్తీ చేశాయి. ఆడమ్ జంపా, డానియెల్ సామ్స్, కేన్ రిచర్డ్‌సన్, ఫిన్ అలెన్‌ల స్థానాల్లో వనిందు హసరంగ, దుష్మంత చమీర, జార్జ్ గార్టన్, టిమ్ డేవిడ్‌లను బెంగళూరు తీసుకుంది. జోఫ్రా ఆర్చర్, ఆండ్రూ టైల స్థానాల్లో గ్లెన్ ఫిలిప్స్, తబ్రేజ్ షంషిలను రాజస్థాన్ ఎంపిక చేసుకుంది.
ప్రపంచ నంబర్ వన్ టీ20 బౌలర్ అయిన దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రేజ్ శాంసీ ..ఇప్పటిదాకా 31 టీ20 మ్యాచ్‌ల్లో 45 వికెట్లను పడగొట్టాడు. 27 వన్డే ఇంటర్నేషనల్స్‌లో 32 వికెట్లు తీసుకున్నాడు. 2016లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్ టోర్నమెంట్‌లో ఆడాడు. మూడు వికెట్లను మాత్రమే తన ఖాతాలో వేసుకోగలిగాడు. ఓ వైపు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత జట్టు.. ఇంగ్లండ్ పర్యటనలో ఉండగానే.. మరోవైపు యూఏఈ గడ్డపై ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్ సందడి మొదలైంది. కోహ్లీ, రోహిత్, బుమ్రా వంటి స్టార్లు ఇంగ్లిష్ టీమ్‌తో టెస్టు సిరీస్ ఆడుతుండగా.. ధోనీ, రైనా వంటి వెటరన్స్.. ఇషాన్ కిషన్‌లాంటి యంగ్‌స్టర్స్ వచ్చే నెల 19 నుంచి అరబ్ గడ్డపై జరిగే ఐపీఎల్ 14వ సీజన్ ఫేజ్2 కోసం రెడీ అవుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఇప్పటికే యూఈఏ చేరుకొని ప్రాక్టీస్ షురూ చేశాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అరబ్ గడ్డపై అడుగు పెట్టి సన్నాహకాలు ప్రారంభించింది. మిగతా ఫ్రాంచైజీలు కూడా మరో రెండు, మూడు రోజుల్లో యూఏఈ చేరుకొని ప్రిపరేషన్స్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాయి. ఓవరాల్‌గా అరబ్ గడ్డపై ఐపీఎల్ కోసం అన్ని ఫ్రాంచైజీలు.. కొత్త ప్లేయర్లతో సరికొత్త ప్రణాళికలతో సిద్ధమవుతున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు క్రికెట్ అభిమానులకు కావాల్సిన మజా అందనుంది.