IPL 2021: భారత జట్టులో కరోనా కలకలం.. యూఏఈ ప్రభుత్వం కొత్త నిబంధన! ఆందోళనలో ఫ్రాంచైజీలు!

న్యూఢిల్లీ: కరోనాతో ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 మలిదశ మ్యాచ్‌లో యూఏఈ వేదికగా మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఫ్రాంచైజీలన్నీ అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో అరబ్ గడ్డపై ప్రాక్టీస్ క్యాంప్‌లు మొదలుపెట్టాయి. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత ఆటగాళ్లు కూడా ఐపీఎల్ రెండో దశ కోసం యూఏఈ వెళ్లాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం 5వ టెస్టు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 14 లేదా 15న యూఏఈకి బయలుదేరాల్సి ఉంది. కానీ భారత జట్టులో కరోనా కలకలం రేగడంతో ఆఖరి టెస్ట్ రద్దయింది. దాంతో భారత ఆటగాళ్లు ముందుగానే యూఏఈకి బయల్దేరనున్నారు.

కొత్త మెలిక..
ఇక మెగా లీగ్ ప్రారంభానికి ముందు యూఏఈ ప్రభుత్వం కొత్త మెలిక పెట్టింది. ఇంగ్లండ్ నుంచి యూఏఈకి వస్తున్న ఆటగాళ్లను నేరుగా అనుమతించబోమని పేర్కొంది. భారత జట్టులో కరోనా కలకలం రేగడంతో ఆటగాళ్లంతా తప్పనిసరిగా 6 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని చెబుతుంది. వాస్తవానికి ఇండియా-ఇంగ్లండ్ సిరీస్‌లో ఉన్న ఆటగాళ్లు, కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనే ఆటగాళ్లకు ఎలాంటి క్వారంటైన్ నిబంధన వర్తించదని ముందుగా పేర్కొన్నారు. ఆయా ఆటగాళ్లందరూ బయోబబుల్ నుంచి వస్తున్నారు కాబట్టి బబుల్ టూ బబుల్ అనుమతి ఉందని తెలిపారు. కానీ తాజాగా ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియాలో కరోనా కేసులు నమోదవడంతోనే యూఏఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

కఠిన నిబంధనలు..
ఇక యూఏఈ రానున్న ఆటగాళ్లందరికీ కఠిన నిబంధనలు అమలు చేయనున్నారు. క్రికెటర్లు, సహాయక సిబ్బంది అందరినీ గమనించేందుకు ప్రత్యేకంగా బబుల్ మేనేజర్లను నియమించనున్నారు. వీరు ఆటగాళ్ల కదలికలపై ఎప్పటికప్పుడూ నిఘా పెట్టడంతో పాటు బయోబబుల్ నిబంధనలు ఉల్లంఘించకుండా వారిని హెచ్చరించనున్నారు. ఐపీఎల్ రెండో దశ కోసం 14 బయోబబుల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. 8 బబుల్స్ ఫ్రాంచైజీల కోసం ఏర్పాటు చేయనుండగా.. మిగిలినవి బ్రాడ్‌కాస్ట్ సిబ్బంది, కామెంటేటర్లు, మ్యాచ్ అఫీషియల్స్ కోసం కేటాయించనున్నారు.

ఫస్టాఫ్ అనుభవంతో..
బయోబబుల్ లోనికి వెళ్లిన ఆటగాళ్లు, అధికారులను అసలు బయటకు వెళ్లడానికి అనుమతించరు. ఒక వేళ అత్యవసర పరిస్థితిలో వెళ్లాల్సి వస్తే... తిరిగి రావడానికి కనీసం ఆరు సార్లు కోవిడ్ పరీక్షలు నిర్వహించి... వాటిలో నెగెటివ్ వస్తేనే అనుమతిస్తారు. బయో బబుల్ మొత్తం బీసీసీఐ చీఫ్ మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో నడవనుంది. ఐపీఎల్ ఫస్టాఫ్‌లోని తప్పిదాలు పనరావృతం కాకుండా అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేయనున్నారు. ఐపీఎల్ ముగిసిన అనంతరం యూఏఈ వేదికగానే టీ20 ప్రపంచకప్ జరుగనున్నది. ఈ టోర్నీని కూడా బీసీసీఐ నిర్వహించనుంది. అయితే ఈ ఈవెంట్ మొత్తం ఐసీసీ కనుసన్నల్లో నడువనున్నది కాబట్టి.. ఇంకా కఠిన నిబంధనలు అమలు కానున్నాయి.

ఇద్దరి కోసం ప్రత్యేక విమానం..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ కెప్టెన్ విరాట్ కోహ్లి, మహమ్మద్ సిరాజ్‌ల కోసం ప్రత్యేక చార్టర్ ఫ్లైట్‌ను లండన్‌కు పంపించనుంది. ప్రత్యేక విమానంలో దుబాయ్‌కి చేరుకోనున్న ఈ ఇద్దరు ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఈ విషయాన్ని ఆర్‌సీబీ ఒక ప్రకటనలో తెలిపింది. కోహ్లి, సిరాజ్‌ల కోసం ప్రత్యేక చార్టర్ ఫ్లైట్‌ను సిద్ధం చేశాం. శనివారం రాత్రి కోహ్లి, సిరాజ్‌లు చార్టర్ ఫ్లైట్ ఎక్కుతారు.. ఆదివారం ఉదయం దుబాయ్‌లో దిగిన వెంటనే నిబంధనల ప్రకారం ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారని ఆ ప్రకటనలో పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications