
ముంబై: రాబోయే ఐపీఎల్ 2021 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించడం చాలా కష్టమని టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. ఆ జట్టు ఆటగాళ్లంతా భీకర ఫామ్‌లో ఉన్నారని తెలిపాడు. తాజాగా హిందూస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ అప్‌కమింగ్ ఐపీఎల్ సీజన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ముంబై ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, పాండ్యా బ్రదర్స్ అద్భుతంగా ఆడారని, వారు మంచి ఫామ్‌లో ఉన్నారని కొనియాడాడు.
'ఈసారి ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించడం కష్టం. ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆ జట్టు ఆటగాళ్లు చెలరేగారు. వారంతా మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇషాన్, సూర్య ఆడిన తీరు అద్భుతం. తొలి అంతర్జాతీయ సిరీస్‌లోనే అదరగొట్టారు. అలాగే హార్దిక్ పాండ్యా తిరిగి బౌలింగ్ చేయడం శుభపరిణామం. అది ముంబై జట్టుకే కాకుండా టీమిండియాకు ఎంతో కీలకం. దీన్ని బట్టి అతను జూన్‌లో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కాసిన్ని ఓవర్లు అయినా బౌలింగ్ చేయగలడు. దానికింకా చాలా సమయం ఉన్నా అది టీమిండియా, ముంబై జట్లకు మంచి విశేషం' అని గవాస్కర్ పేర్కొన్నాడు.
ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 మ్యాచ్‌లు జరగనున్న విషయం తెలిసిందే. ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ మ్యాచ్‌లకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. టోర్నీ మొదటి మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఏప్రిల్ 9న ముంబై ఇండియన్స్ ఢీ కొట్టబోతోంది. ఒక్క మ్యాచ్ కూడా తన సొంత మైదానంలో ఆడే అవకాశం ఏ జట్లకూ లేదు. టోర్నీలో మ్యాచ్‌ల్నీ అన్ని జట్లూ తటస్థ వేదికల్లోనే ఆడనున్నాయి.