
4 బంతుల్లో 13 పరుగులు:
సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి 4 బంతుల్లో 13 పరుగులు అవసరం అయ్యాయి. ఈ దశలో బెంగళూరు ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ ఓ బీమర్‌ని సంధించాడు. దాంతో అతడిని వెంటనే బౌలింగ్ నుంచి తప్పించాలని డేవిడ్ వార్నర్ డగౌట్ నుంచి డిమాండ్ చేశాడు. అప్పటికే ఒక బీమర్‌ని సందించిన కారణంగా.. వార్నర్ అలా డిమాండ్ చేశాడు. 2017లో మార్చిన క్రికెట్ నిబంధనల ప్రకారం ఒక మ్యాచ్‌లో బౌలర్ రెండు బీమర్లని సంధిస్తే.. అతడ్ని వెంటనే బౌలింగ్ నుంచి తప్పిస్తారు.

బౌలింగ్ నుంచి తప్పించాలని డిమాండ్:
ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో జేసన్ హోల్డర్‌కి ఓ బీమర్‌ని హర్షల్ పటేల్ సంధించాడు. అయితే ఆ బంతిని ఫీల్డ్ అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. చివరి ఓవర్‌లోనూ రషీద్ ఖాన్‌కి మరోసారి బీమర్‌ని హర్షల్ వేశాడు. ఈ బంతిని కూడా నోబాల్‌గా అంపైర్ ప్రకటించాడు. అయితే రెండు బీమర్లు విసిరిన నేపథ్యంలో.. ఐసీసీ రూల్స్ ప్రకారం డేవిడ్ వార్నర్ స్పందించాడు. హర్షల్‌ను వెంటనే బౌలింగ్ నుంచి తప్పించాలని డగౌట్ నుంచి వెలుపలి వచ్చి వార్నర్ డిమాండ్ చేశాడు. ఈ విషయమై బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫోర్త్ అంపైర్‌తో అతను మాట్లాడుతూ కనిపించాడు. కానీ ఫీల్డ్ అంపైర్లు మాత్రం హర్షల్ బౌలింగ్ చేయించారు.

సన్‌రైజర్స్ కోచ్ వివరణ:
ఈ విషయంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ ట్రెవర్ బేలిస్ మాట్లాడుతూ... 'వార్నర్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఎందుకంటే ఆ సమయంలో జట్టు ఓడిపోతూ కనిపించింది. రెండు బీమర్లు వేసినా హర్షల్ పటేల్‌ని బౌలింగ్ నుంచి ఫీల్డ్ అంపైర్లు తప్పించకపోవడం సరైన నిర్ణయమే. ఎందుకంటే.. హోల్డర్‌కి విసిరిన బీమర్ నేరుగా శరీరంపైకి రాలేదు. ఆ బీమర్‌కి అంపైర్ నోబాల్ మాత్రమే ఇచ్చాడు.. వార్నింగ్ ఇవ్వలేదు. అందుకే అతడిని బౌలింగ్ నుంచి తప్పించలేదు' అని వివరణ ఇచ్చాడు.

చెత్త షాట్లు ఆడాం:
'ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టం. మా బౌలర్లు ప్రత్యర్థిని అద్భుతంగా నిలువరించారు. మాక్స్‌వెల్ మాత్రం బాగా బ్యాటింగ్ చేశాడు. చివర్లో నిలదొక్కుకున్న బ్యాట్స్‌మెన్ ఇద్దరు క్రీజులో ఉండాలని భావించాం. కానీ మేం అందులో విఫలమయ్యాం. భాగస్వామ్యాలు నిర్మించి చక్కని క్రికెట్ షాట్లు ఆడటం అవసరం. చెత్త షాట్లు ఆడాం. ఇక్కడ అలా ఆడకూడదు. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడటం నిరాశపరిచింది. మున్ముందు మ్యాచుల్లో ఎలా ఆడాలో మాకు తెలుసు. ఇదే వేదికలో మాకు మరో మూడు మ్యాచులు ఉన్నాయి. పిచ్‌లు మెరుగవుతాయని భావిస్తున్నాం. పవర్‌ప్లే ఓవర్లలో తక్కువ నష్టం జరిగేలా బంతులు విసిరాలన్నది మా ప్రణాళిక. చెపాక్‌లో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టే నాలుగు మ్యాచులు గెలవాల్సింది' అని డేవిడ్ వార్నర్ మ్యాచ్ అనంతరం చెప్పాడు.


Click it and Unblock the Notifications

IPL 2021:బ్యాట్స్‌మన్ వైఫల్యంతో రెండు మ్యాచుల్లో ఓడిన సన్‌రైజర్స్..ఈ జట్టుతో బరిలోకి దిగితే మాత్రం విజయాలే!










