ఈ సీజన్‌లో డేవిడ్ వార్నర్ మళ్లీ ఆడకపోవచ్చు: సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్

హైదరాబాద్: ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలో కెప్టెన్సీ కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ సారథి డేవిడ్ వార్నర్ తదుపరి మ్యాచ్‌ల్లో కూడా అడే అవకాశం లేదని ఆ జట్టు కోచ్ ట్రెవర్ బెయిలీస్ అన్నాడు. విదేశీ ఆటగాళ్లు నలుగురే ఉండే నిబంధనతో తాము బౌలింగ్ ఆప్షన్లను కూడా దృష్టిలో పెట్టుకునే వార్నర్‌ను పక్కన పెట్టినట్లు ట్రెవర్ వెల్లడించాడు. ఇది కఠిన నిర్ణయమైనప్పటికీ జట్టు ప్రయోజనాల కోసం తప్పలేదన్నాడు. తాము ఆడబోయే మిగతా మ్యాచ్‌ల్లోనూ దాదాపుగా ఇదే వ్యూహాన్ని కొనసాగించే అవకాశం ఉందన్నాడు.

ఇదే టీమ్ కొనసాగిస్తాం..
'ఇది చాలా కష్టమైన నిర్ణయం. బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేయాలనే ఆలోచనతో అదనపు బౌలర్‌ను తీసుకోవాలనుకున్నాం. దానికోసం ఓవర్‌సీస్ ఆల్‌రౌండర్‌ను జట్టులోకి తీసుకున్నాం. ఈ మ్యాచ్‌లో నబీకి అవకాశం ఇచ్చాం. భవిష్యత్తు మ్యాచ్‌ల్లో జాసన్ హోల్డర్‌ను తీసుకుంటాం. మేం ఆశించిన ఫలితం వస్తే ఇదే జట్టును కొనసాగిస్తాం. అద్భుతమైన ప్రదర్శనతో మరిన్ని విజయాలు సాధించాలనుకుంటున్నాం. అయితే ఒకటి రెండు మ్యాచ్ ఫలితాలతో ఆటగాళ్లను తప్పించలేం. ఈ లెక్కన తదుపరి మ్యాచ్‌ల్లో కూడా వార్నర్ బెంచ్‌కే పరిమితం కావచ్చు'అని ట్రెవర్ పేర్కొన్నాడు.

వార్నర్ షాకయ్యాడు..
కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంతో వార్నర్ షాక్‌కు గురయ్యాడని టీమ్ డైరెక్టర్ టామ్ మూడీ అన్నాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదన్నాడు. ఇది అందరం కలిసి సమష్టిగా తీసుకున్న కఠిన నిర్ణయమని, ఇందులో ఏ ఒక్కరి పాత్ర లేదని స్పష్టం చేశాడు. 'నిర్ణయం కఠినమైనదే అయినా అమలు చేయలేక తప్పలేదు. ఎందుకంటే మేం రేస్‌లో చాలా ముందుకు వెళ్లాలనుకుంటున్నాం. ఇలాంటి నిర్ణయాల వల్ల కొందరికి ఇబ్బంది కలగొచ్చు. నిరాశ కూడా చెందొచ్చు. వార్నర్ అయితే షాక్‌కు గరయ్యాడు. కానీ తప్పలేదు. గతంలో వార్నర్ బాగా ఆడి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఫామ్‌లేమితో పాటు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు.'అని మూడీ చెప్పుకొచ్చాడు.

జట్టులోకి వస్తాడు..
డేవిడ్ వార్నర్‌ను తుది జట్టు నుంచి తప్పించడంపై సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పందించాడు. అతడు ప్రపంచ స్థాయి ఆటగాడని ప్రశంసించాడు. త్వరలోనే అతడు జట్టులోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. 'సన్‌రైజర్స్ బృందంలో చాలా మంది నాయకులున్నారు. మేం కలిసి కట్టుగా ఉండడం చాలా ముఖ్యం. అవసరమైన మార్పులు చేస్తూ జట్టును పటిష్ఠంగా నిర్మించడం మాకు అవసరం. విజయం కోసం అతిగా వెతకడం కంటే కూడా మేం ఎలా ఆడుతున్నామనేది ప్రధానం. వార్నర్ ప్రపంచ స్థాయి ఆటగాడు. అతను మా పరిగణలోనే ఉన్నాడు. తనను తిరిగి జట్టులోకి తీసుకునేందుకు చర్చలు సాగుతాయని అనుకుంటున్నా.'అని విలియమ్సన్ చెప్పుకొచ్చాడు.

కెప్టెన్ మారినా రాత మారలేదు..
వార్నర్ పక్కనపెడుతూ కఠిన నిర్ణయం తీసుకున్నా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు విజయం దక్కలేదు. పేలవ బౌలింగ్, పసలేని బ్యాటింగ్, చెత్త ఫీల్డింగ్‌తో 55 పరుగుల తేడాతో హైదరాబాద్ చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 220 పరుగులు చేసింది. జోస్ బట్లర్(64 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 124) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. సంజూ శాంసన్(33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) భాద్యతాయుత ఇన్నింగ్స్‌తో రాణించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ, రషీద్ ఖాన్, విజయ్ శంకర్ తలో వికెట్ తీశారు. అనంతరం హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. జానీ బెయిర్ స్టో(31), మనీష్ పాండే(30)తో సహా అంతా విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్, క్రిస్ మోరీస్ మూడేసి వికెట్లు తీయగా.. కార్తీక్ త్యాగీ, రాహుల్ తెవాటియా చెరొక వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications