అందుకే తుది జట్టులో ఆ ఇద్దర్ని తీసుకోలేదు: సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్

చెన్నై: ఒకే ఒక్క ఓవర్.. ఓటమి అంచుల్లో ఉన్న బెంగళూరును గెలుపువైపు తీసుకెళ్లగా.. ఒక్క బ్యాట్స్‌మన్ కూడా ఓపిక చూపకపోవడంతో గెలిచే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. 16 ఓవర్ల వరకు మ్యాచ్‌ను తమ చేతుల్లో ఉంచుకున్న ఆరెంజ్ ఆర్మీ.. స్పిన్నర్ షాబాజ్ అహ్మద్(3/7) కొట్టిన దెబ్బకు నిలువెల్లా వణికిపోయింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుంది. ఆఖరి బంతి వరకు థ్రిల్లింగ్‌గా సాగిన మ్యాచ్‌లో 6 పరుగుల స్వల్ప తేడాతో నెగ్గిన బెంగళూరు.. సెకండ్ విక్టరీతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమికి టీమ్‌మేనేజ్‌మెంట్ పసలేని ప్రణాళికలు కూడా కారణమని మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. తుది జట్టు ఎంపిక కూడా బాలేదని మండిపడ్డారు. అసలు కేన్ విలియమ్సన్‌ను ఎందుకు ఆడించడం లేదని ప్రశ్నిస్తున్నారు.

మాజీల విమర్శలు..
వరల్డ్ క్లాస్ ప్లేయర్ అయిన కేన్ విలియమ్సన్ తుది జట్టులో ఉంటే మిడిలార్డర్‌లో బలం చేకూరుతుందని అభిప్రాయపడుతున్నారు. ఆర్‌సీబీ చేతిలో ఓటమి అనంతరం..కేన్ విలియమ్సన్ తుది జట్టులో లేకపోవడంతోనే హైదరాబాద్ మూల్యం చెల్లించుకుందని మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక హైదరాబాద్ టీమ్‌మేనేజ్‌మెంట్‌పై వీరేంద్ర సెహ్వాగ్ సైతం సెటైర్లు పేల్చాడు. కేన్ విలియమ్సన్ ఎందుకు ఆడించడం లేదని ప్రశ్నించాడు. అంతేకాకుండా టర్నింగ్ ట్రాక్‌పై మహ్మద్ నబీతో బరిలోకి దిగకుండా జేసన్ హోల్డర్ తీసుకురావడం కూడా దెబ్బతీసిందని అభిప్రాయపడుతున్నారు.

గాయంతో కేన్..
మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ ట్రెవర్ బైలిస్ ఈ విమర్శలపై వివరణ ఇచ్చాడు. కేన్ విలియమ్సన్ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతోనే అతన్ని తుది జట్టులోకి తీసుకోలేదని స్పష్టం చేశాడు. అతను బరిలోకి దిగడానికి ఇంకాస్త సమయం పడుతుందన్నాడు. ప్రస్తుతం అతను నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటున్నాడని, అతి త్వరలో మైదానంలోకి బరిలోకి దిగుతాడని తెలిపాడు. 'ఆర్‌సీబీతో మ్యాచ్‌కు ముందు మేం రెండు రోజులు ప్రాక్టీస్ నిర్వహించాం. ఇందులో ఒకరోజు కేన్ విలియమ్సన్ పాల్గొన్నాడు. అతి త్వరంలోనే అతను మ్యాచ్ బరిలో దిగుతాడు.'అని సన్‌రైజర్స్ కోచ్ స్పష్టం చేశాడు.

మహ్మద్ నబీ కూడా..
ఇక ఫస్ట్ మ్యాచ్‌లో గాయపడ్డ మహ్మద్ నబీకి కోలుకునేందుకు విశ్రాంతి ఇచ్చామని, అందుకే అతని స్థానంలో జాసన్ హోల్డర్‌ను తీసుకొచ్చామన్నాడు.'కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ నబీ తలకు బంతి తాకిన విషయం తెలిసిందే. అతను ఇంకా ఆ నొప్పితో బాధపడుతున్నాడు. దాంతోనే మేం జాసన్ హోల్డర్‌ను జట్టులోకి తీసుకొచ్చాం. అతను అంచనాల మేరకు రాణించాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు.'అని ట్రెవర్ బైలిస్ తెలిపాడు. హోల్డర్ బ్యాటింగ్‌లో విఫలమైనా బౌలింగ్‌లో సత్తా చాటాడు.

చేజేతులా..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 రన్స్ చేసింది. గ్లేన్ మ్యాక్స్ వెల్(41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59), విరాట్ కోహ్లీ(29 బంతుల్లో 4 ఫోర్లతో 33) మినహా అంతా విఫలమయ్యారు. సన్‌రైజర్స్ బౌలర్లలో జాసన్ హోల్డర్ మూడు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ రెండు, షబాజ్ నదీమ్, నటరాజన్, భువీ తలో వికెట్ దక్కించుకున్నారు. అపంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 రన్స్‌కే పరిమితమైంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్(37 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 54), మనీశ్ పాండే(39 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) రాణించినా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఆర్‌సీబీ బౌలర్లలో షాబాజ్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా.. సిరాజ్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు. కైల్ జేమీసన్‌కు ఓ వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications