
గేట్ రెవెన్యూతో..
'యూకే ఎప్పుడూ ఖరీదైన ప్రాంతమే. కానీ, అక్కడి గవర్నమెంట్ స్పోర్ట్స్ ఈవెంట్ల కోసం ఫ్యాన్స్‌ను అనుమతిస్తోంది. ఫ్రాంచైజీలకు గేట్ రెవెన్యూ (టిక్కెట్ల డబ్బు) వస్తుంది కాబట్టి ఖర్చులను మేనేజ్ చేసుకోవచ్చు' అని ఐపీఎల్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ జూన్ తర్వాత వరల్డ్‌కప్‌ను ఇండియా బయటకు తీసుకెళ్లాలని బీసీసీఐ నిర్ణయించినా కూడా ఐపీఎల్‌కు ఇంగ్లండ్ ఫస్ట్ చాయిస్ ఆప్షన్‌గా ఉంటుందని చెప్పాయి. ఖర్చులు తగ్గించుకోవాలంటే మాత్రం యూఏఈ సెకండ్ ఆప్షన్‌గా ఉంటుందని, అలాగే, శ్రీలంకలో ఐపీఎల్ నిర్వహించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని బోర్డు వర్గాలు అంటున్నాయి.

ఇంగ్లండ్ సిరీస్‌లో మార్పులు..
ఐపీఎల్ ఫేజ్-2 కోసం భారత్- ఇంగ్లండ్ మధ్య జరగబోయే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. అవసరమైతే ఈ సిరీస్‌లో మ్యాచ్‌ల సంఖ్యను కుదించే అవకాశం ఉంది. తద్వారా టీ20 ప్రపంచకప్‌నకు ముందే ఐపీఎల్‌ను పూర్తి చేయవచ్చు. ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)తో బీసీసీఐ చర్చలు కూడా జరుపుతున్నట్టు సమాచారం.
'ఐపీఎల్‌ను సర్దుబాటు చేసేందుకు ఐదు టెస్టుల సిరీస్‌లో మార్పులు చేసేందుకు ఈసీబీ, బీసీసీఐ మధ్య చర్చలు జరుగుతున్నాయి. కానీ, ఆ వివరాలు ఇంకా బహిర్గతం కాలేదు. టెస్టు సిరీస్‌లో మార్పులు చేయడానికి ఈసీబీ అంగీకరిస్తే మాత్రం ఐపీఎల్ తమ దేశంలోనే జరగాలని కోరుకుంటుంది. ఎందుకంటే లీగ్ వల్ల ఆ దేశానికి ఆదాయం వస్తుంది. దీనివల్ల ఇరు బోర్డులకు ప్రయోజనం ఉంటుంది. ఏదేమైనా ఐపీఎల్‌ను పూర్తి చేయడం బీసీసీఐ తొలి ప్రాధాన్యత కానుంది. దీనిపై వాటాదారులందరినీ ఏకాభిప్రాయానికి తీసుకొచ్చింది. కాబట్టి 14వ సీజన్‌ను పూర్తి చేసే విషయంలో అనుమానమే అవసరం లేదు'అని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.

భారత్‌లోనే ప్రపంచకప్
దేశంలో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్నప్పటికీ ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను భారత్‌లోనే నిర్వహించేందుకు బీసీసీఐ కట్టుబడి ఉంది. ఎస్‌జీఎంలో ఈ విషయంపై చర్చించనుంది. జూన్1న ఐసీసీ మీటింగ్ ఉన్న నేపథ్యంలో వరల్డ్‌కప్ ఆతిథ్యంపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అవసరం అయితే చివరి నిమిషంలో టోర్నీని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు షిఫ్ట్ చెయ్యడాన్ని సెకండ్ ఆప్షన్‌గా కొనసాగించనుంది. అయితే, దేశంలో కరోనా పరిస్థితిని బట్టి జులై తర్వాతే తరలింపుపై నిర్ణయం తీసుకోనుంది.

యూఏఈ సెకండ్ ఆప్షన్..
'ఇప్పటికైతే ఇండియానే వరల్డ్‌కప్‌నకు హోస్ట్. బీసీసీఐ ఆలోచన ఇదే. అయితే పరిస్థితులు మళ్లీ చేయి దాటితే మాత్రం జూన్ తర్వాతే దీనిపై పునరాలోచన చేస్తుంది. యూఏఈ మాత్రం సెకండ్ ఆప్షన్‌గా ఉంటుంది' అని బోర్డు వర్గాలు చెప్పాయి. అవసరమైతే రెండు నగరాల్లోనే (ముంబై, పుణె) మొత్తం టోర్నీని పూర్తి చేయాలని, ఫైనల్‌ను మాత్రం అహ్మదాబాద్ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందని తెలుస్తోంది. కాగా, డొమెస్టిక్ క్రికెట్‌పై ఎస్‌జీఎంలో బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదు.


Click it and Unblock the Notifications












