
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ప్రయాణం ఒక్క మ్యాచ్‌తోనే ముగిసింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఈ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. పంజాబ్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ క్యాచ్ అందుకునే క్రమంలో స్టోక్స్ ఎడమ చేతి వేలికి గాయమైంది. మ్యాచ్ అనంతరం పరీక్షలు చేయగా.. అతని చూపుడు వేలు విరిగినట్లు తేలడంతో డాక్టర్లు సర్జరీ చేయాలని సూచించారు. దాంతో అతను స్వదేశానికి బయల్దేరిపోయాడు. శుక్రవారం రాత్రే ఇంగ్లండ్‌కు బయల్దేరాడు. ఈ విషయాన్ని ఈసీబీ ఒక ప్రకటనలో తెలిపింది.
అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడి వెళ్లడానికి స్టోక్స్ అస్సలు ఇష్టపడలేదని, సర్జరీ అనివార్యం కావడంతో అతను బలవంతంగా ఇంగ్లండ్‌కు పంపించారని రాజస్థాన్ టీమ్ అధికారి ఒకరు తెలిపారు. జట్టుతో పాటే ఉండి ఆఫ్ ద ఫీల్డ్‌లో సలహాలు ఇవ్వాలని స్టోక్స్ నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని ఫ్రాంచైజీకి కూడా తెలిపాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆపరేషన్ అవసరం కాబట్టి ఈసీబీ పట్టుబట్టడంతో స్టోక్స్ స్వదేశానికి బయల్దేరక తప్పలేదు.
ఇక జట్టును వీడేందుకు సిద్దమైన స్టోక్స్‌కు రాజస్థాన్ రాయల్స్ మంచి బహుమతిచ్చింది. ఇటీవల మరణించిన అతని తండ్రి జెడ్ స్టోక్స్ పేరిట జెర్సీని రూపొందించి ఇచ్చింది. ఇక స్టోక్స్ త్వరగా కోలుకోవాలని రాజస్థాన్ రాయల్స్ టీమ్ ట్వీట్ చేసింది. రాజస్థాన్‌ను స్టోక్స్ వీడిన తర్వాత ఫ్యాన్స్ భావోద్వేగానికి లోనవుతూ ట్వీటర్ వేదికగా స్పందించారు. 'నీకు సర్జరీ అనివార్యం కావడంతో ఈ ఐపీఎల్‌లో నీ మెరుపుల్ని మిస్సవుతున్నాం' అని ఒక అభిమాని ట్వీట్ చేయగా, 'అవును డ్యూడ్. నువ్వు రాజస్థాన్‌కు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్‌వి. టేక్ కేర్' అని మరొకరు ట్వీట్ చేశారు.
'నిన్ను తప్పకుండా మిస్సవుతాం చాంపియన్. తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో స్టోక్స్ స్థానాన్ని అలాగే ఉంచండి. అతన్ని జట్టుతో కొనసాగించండి ఆర్‌ఆర్.. ప్లీజ్' అని మరొక ఫ్యాన్ స్పందించాడు. 2018 నుంచి రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్న స్టోక్స్.. ఇప్పటి వరకు 31 మ్యాచ్‌ల్లో 604 రన్స్ చేశాడు. బౌలింగ్‌లో 16 వికెట్లు తీశాడు. ఇప్పటికే జోఫ్రా ఆర్చర్ సేవలను కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్‌కు స్టోక్స్ దూరమవ్వడం కోలుకోలేని దెబ్బే.