అందరికీ నెగటీవ్..
'భారత జట్టులోని ముగ్గురు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు యూఏఈకి చేరుకున్నారు. రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు సూర్యకుమార్ యాదవ్‌లు సతీసమేతంగా ఫ్రాంచైజీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో ఈ రోజు(శనివారం) ఉదయం అబుదాబికి చేరుకున్నారు. వీళ్లంతా ఐపీఎల్ గైడ్‌లైన్స్ ప్రకారం ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. ప్రయాణానికి ముందు అందరికి ఆర్‌టీపీసీఆర్ పరీక్షల్లో నెగటీవ్ వచ్చింది. అబుదాబి చేరుకున్న తర్వాత మరోసారి ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేయగా మళ్లీ నెగటీవ్ వచ్చింది'అని ముంబై ఇండియన్స్ పేర్కొంది.
కరోనా కలకలం..
షెడ్యూల్ ప్రకారం 5వ టెస్టు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 14 లేదా 15న యూఏఈకి బయలుదేరాల్సి ఉంది. కానీ భారత జట్టులో కరోనా కలకలం రేగడంతో ఆఖరి టెస్ట్ రద్దయింది. దాంతో భారత ఆటగాళ్లు ముందుగానే యూఏఈకి పయనమయ్యారు. టెస్ట్ సిరీస్ సజావుగా జరుగుంటే.. ఆటగాళ్లు ఎలాంటి క్వారంటైన్ అవసరం లేకుండానే బబుల్ టు బబుల్ నేరుగా జట్టుతో కలిసేవారు. కానీ టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కరోనా వైరస్ బారనపడటం.. అతనికి సన్నిహితంగా ఉన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియో నితిన్ పటేల్ కూడా పాజిటీవ్ తేలడం.. ఐదో టెస్ట్‌కు ముందు అసిస్టెంట్ ఫిజియో యోగేశ్ పర్మార్‌కు కూడా ప్రాణంతక వైరస్ సోకడంతో చివరి మ్యాచ్ రద్దయింది.
నెగటీవ్ వచ్చినా..
ఇక యోగేశ్ పర్మార్‌కు రోహిత్ శర్మ సన్నిహితంగా ఉండటం అందర్నీ కలవరపాటుకు గురి చేసింది. హిట్‌మ్యాన్‌కు ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో నెగటీవ్ రావడంతో ముంబై ఫ్రాంచైజీతో పాటు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆరు రోజుల క్వారంటైన్‌లో అతను పాజిటీవ్‌గా తేలితే దాదాపు ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్ మ్యాచ్‌లన్నీ దూరం కానున్నాడు. ఆర్‌టీపీసీఆర్ టెస్ట్‌ల్లో అందరికి నెగటీవ్ వచ్చినప్పటికీ.. సాధారణంగా కరోనా లక్షణాలు మూడు, నాలుగు రోజు తర్వాత బయటపడతాయి. ఇప్పుడు ఇదే అందర్నీ కలవరపాటుకు గురిచేస్తోంది.

రేపు కోహ్లీ, సిరాజ్..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్‌ల కోసం ప్రత్యేక చార్టర్ ఫ్లైట్‌ను లండన్‌కు పంపించనుంది. ప్రత్యేక విమానంలో దుబాయ్‌కి చేరుకోనున్న ఈ ఇద్దరు ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఈ విషయాన్ని ఆర్‌సీబీ ఒక ప్రకటనలో తెలిపింది. కోహ్లీ, సిరాజ్‌ల కోసం ప్రత్యేక చార్టర్ ఫ్లైట్‌ను సిద్ధం చేశాం. శనివారం రాత్రి కోహ్లీ, సిరాజ్‌లు చార్టర్ ఫ్లైట్ ఎక్కుతారు.. ఆదివారం ఉదయం దుబాయ్‌లో దిగిన వెంటనే నిబంధనల ప్రకారం ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారని ఆ ప్రకటనలో పేర్కొంది.


Click it and Unblock the Notifications












