లసిత్ మలింగా.. ముంబై నిన్ను ఎంతో మిస్సవుతుంది: రోహిత్ శర్మ

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌కు ముందే ఫ్రాంచైజీ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన శ్రీలంక దిగ్గజ పేసర్, ముంబై ఇండియన్స్ బౌలర్ లసిత్ మలింగను ఆ జట్టు కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అభినందించాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఓ వెలుగు వెలిగిన మలింగ.. భారత్ క్యాష్ రిచ్ లీగ్ రిటెన్షన్ ప్రక్రియ ప్రారంభానికి ముందే ఆటకు అల్విదా ప్రకటిస్తున్నట్లు ముంబై ఇండియన్స్‌కు సమాచారం అందించాడు. ఈ నేపథ్యంలోనే ముంబై జట్టు మలింగతో ఉన్న 12 ఏళ్ల అనుబంధానికి ముగింపు పలికింది.
ఐపీఎల్ 2021 మినీ వేలం కోసం రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాను బుధవారం ప్రకటించిన ముంబై.. మలింగతో పాటు ఆసీస్‌కు చెందిన జేమ్స్ పాటిన్సన్, నాథన్ కౌల్టర్‌నీల్, మిచెల్ మెక్లీగన్, షెర్ఫన్ రూథర్‌ఫర్డ్, ప్రిన్స్ బల్వంత్ రాయ్, దిగ్విజయ్ దేశ్‌ముఖ్‌లను వదులుకొని 18 మందిని రిటైన్ చేసుకుంది.
మలింగ నువ్వో దిగ్గజం..
ఇక ముంబై తరఫున ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన మలింగ రిటైర్మెంట్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. మలింగను ముంబై ఎంతో మిస్సవుతుందని అతనితో ఉన్న ఫొటోను పంచుకున్నాడు. 'ఫ్రాంచైజీ క్రికెట్ చూసిన అత్యుత్తమ ఆటగాడు మలింగ. అతనో మ్యాచ్ విన్నర్. మలింగను ముంబై ఇండియన్స్ ఎంతో మిస్సవుతుంది'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

మా అదృష్టం మలింగ..
మలింగను వదులుకునే క్రమంలో ముంబై ఇండియన్స్ కూడా ఎంతో భావోద్వేగానికి గురైంది. 'మలింగ.. థ్యాంక్యూ ఫర్ ఎవర్.. నీలాంటి ఆటగాడు 12 ఏళ్లు మా జట్టుకు ప్రాతినిధ్యం వహించడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడు నిన్ను వదులుకున్నా..నీ స్థానం మాత్రం పదిలంగా ఉంటుంది. మిస్ యూ లాట్.. మలింగ. అతనితో పాటు మేము వదులుకున్న ఆటగాళల్లందరికి ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలో ఎప్పటికి ఒక భాగంగా ఉంటారు' అని ట్వీట్ చేసింది.

హయ్యెస్ట్ వికెట్ టేకర్..
2008 ఐపీఎల్ సీజన్ నుంచి ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న మలింగ 12 ఏళ్ల పాటు నిరంతరాయంగా జట్టుకు సేవలు అందించాడు. వ్యక్తిగత కారణాలతో యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్ మాత్రం ఆడలేకపోయాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఈ శ్రీలంక పేసర్ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 122 మ్యాచ్‌లాడిన మలింగ.. 170 వికెట్లు తీశాడు. 2013,2015,2017,2019లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవడంలో మలింగ ప్రధానపాత్ర పోషించాడు. ఇక 2019లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరి బంతికి మ్యాజిక్ చేసి టైటిల్ అందించాడు.

ముంబై రిటెన్షన్ లిస్ట్..
రిటైన్ ప్లేయర్లు: రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, క్రిస్ లిన్, సౌరభ్ తివారీ, ధావల్ కులకర్ణి, బుమ్రా, రాహుల్ చాహర్, బౌల్ట్, ఎం ఖాన్, హార్దిక్ పాండ్యా, జయంత్ యాదవ్, పొలార్డ్, కృనాల్ పాండ్యా, అనుకూల్ రాయ్, ఇషాన్ కిషన్, డికాక్, ఆదిత్యా తారే.
వదులుకున్న ప్లేయర్లు: మలింగ, కౌల్టర్‌నీల్, ప్యాటిన్సన్, రూథర్పొర్డ్, దిగ్విజయ్, ప్రిన్స్, మెక్క్లెనగన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications