ఐపీఎల్ వేలానికి ముందే డిసైడయ్యాం.. కోహ్లీ ఓపెనింగ్ కోసం ఎదురుచూస్తున్నా!

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆ జట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెసన్ అన్నాడు. ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ మినీ వేలానికి ముందే కోహ్లీ ఓపెనింగ్‌పై నిర్ణయం తీసుకున్నామనని తెలిపాడు. 'బోల్డ్ డైరీస్' పేరిట ఆర్‌సీబీ ట్వీట్ చేసిన ఓ వీడియోలో మైక్ హసన్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.
కోహ్లీ సహజంగా టీమిండియా, ఐపీఎల్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడనే విషయం తెలిసిందే. అయితే, ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టీ20లో రోహిత్‌తో కలిసి ఓపెనింగ్ చేసి మంచి స్కోర్ సాధించాడు. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ భవిష్యత్‌లో, ఐపీఎల్‌లో ఓపెనింగ్ చేస్తానని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే మైక్ హసన్ తాజాగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కోహ్లీ ఓపెనింగ్ సూపర్భ్..
'ఐపీఎల్‌లో దేవ్‌దత్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయడం కోసం నిజంగా ఎంతగానో ఎదురుచూస్తున్నా. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఇద్దరూ భిన్నమైన ఆటగాళ్లు. పవర్‌ప్లే తర్వాత కోహ్లీ ఎలా ఆడతాడో మనందరికీ తెలిసిందే. అతడో అసాధారణమైన ఆటగాడు.
ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీ ఓపెనింగ్ చేస్తే అది మరోస్థాయిలో ఉంటుంది. ఇది మా ప్రణాళికలకు కూడా బాగా ఉపయోగపడుతుంది. కోహ్లీ ఐపీఎల్‌లో ఓపెనింగ్ చేయాలని మేం వేలానికి ముందే నిర్ణయించుకున్నాం. అందుకు అనుగుణంగానే మా వేలం ప్రణాళికలు రూపొందించుకున్నాం. అతను టీమిండియాలో ఓపెనింగ్ చేయడం సంతోషంగా ఉంది. దాంతో ఆ స్థానంలో అతనేం చేయగలడో చూపించాడు' అని హెసన్ పేర్కొన్నాడు.

మా వికెట్ కీపింగ్ ఆప్షన్ ఏబీడీనే..
తదుపరి సీజన్‌తో తమ వికెట్ కీపింగ్ ఆప్షన్ ఏబీ డివిలియర్సేనని మైక్ హెసన్ స్పష్టం చేశాడు. గత సీజన్‌లో వికెట్ల వెనుకాల అదరగొట్టిన ఏబీడీ.. ఈ సారి కూడా కీపర్‌గా కొనసాగితే జట్టు బ్యాలెన్స్ ఈజీ అవుతుందని హెసెన్ తెలిపాడు. 'ఏబీ డివిలియర్స్ వికెట్ కీపర్ కొనసాగుతాననడం మా అదృష్టం. అతను మాకు మంచి ఆప్షన్.
అయితే మా జట్టులో రెండు, మూడు ఆప్షన్ కూడా ఉన్నాయి. మహ్మద్ అజారుద్దీన్ సహజసిద్దమైన వికెట్ కీపర్. అలాగే స్పెషలిస్ట్ వికెట్ కీపర్ కేఎస్ భరత్ కూడా ఉన్నాడు. అయితే ఎవరు కీపింగ్ చేస్తారనేది ఇప్పుడే చెప్పలేం.'మైకె హెసన్ తెలిపాడు.

మార్చి 29న స్టార్ట్..
ఇక టీమ్ ప్రాక్టీస్ క్యాంప్ మార్చి 29న ప్రారంభంకానుందని, 28న డివిలియర్స్ వస్తాడని తెలిపాడు. 'ఏప్రిల్ 1వరకు ఆటగాళ్లతో ప్రాక్టీస్ శిభిరానికి చేరుకుంటారు. ఫిన్ అలెన్ మాత్రం ఏప్రిల్ 1న జరిగే టీ20 తర్వాత వస్తాడు. డివిలియర్స్ రెండు రోజుల ముందుగానే జట్టుతో కలుస్తాడు. గతేడాది ఆటగాళ్లంతా నేరుగా రావడం ఇబ్బందులకు గురిచేసింది. కానీ ఈ సారి చాలా మంది అంతర్జాతీయ క్రికెట్ ఆడుతుండటంతో మా పని సులువు అవుతుంది.'అని హెసన్ చెప్పుకొచ్చాడు.

ఓపెనింగ్ చేస్తా..
ఇంగ్లండ్‌తో చివరి టీ20 విజయానంతరం.. భవిష్యత్తులో రోహిత్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తానని, ఐపీఎల్‌లోను ఇన్నింగ్స్ ప్రారంభిస్తామని విరాట్ కోహ్లీ తెలిపిన విషయం తెలిసిందే.
'ఐపీఎల్‌లోనూ నేను ఓపెనింగ్ చేస్తా. గతంలో వివిధ స్థానాల్లో బ్యాటింగ్ చేసిన అనుభవం నాకుంది. అయితే, ఇప్పుడు మాకు బలమైన మిడిలార్డర్ ఉంది. ఇకపై రోహిత్‌తో కలిసి కచ్చితంగా ఓపెనింగ్ చేస్తా. టీ20 ప్రపంచకప్‌లో అతనితో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తా. మా ఇద్దరిలో ఎవరు నిలిచినా ఇతర బ్యాట్స్‌మెన్‌కు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అది జట్టుకు ఎంతో లాభం చేకూరుస్తుంది.'అని విరాట్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications