RCB vs RR: విరాట్ X శాంసన్ గెలిచేదెవరో? ఆర్‌సీబీలోకి మరో హిట్టర్! తుది జట్లు ఇవే!

ముంబై: ఐపీఎల్ 2021 సీజన్‌లో హ్యాట్రిక్ విజయాలతో అదరగొడుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మరో విజయంపై కన్నేసింది. గురువారం వాంఖడే మైదానం వేదికగా జరిగే మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో సత్తా చాటుతున్న కోహ్లీ సేన బలంగా ఉంది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించిన ఆర్‌సీబీ.. తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఈజీగా విక్టరీలతో టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లింది.
ఇదే జోరును కొనసాగిస్తూ రాజస్థాన్‌ను ఓడించాలని కోహ్లీసేన భావిస్తోంది. మరోవైపు రాజస్తాన్ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓడి డీలా పడింది. గత పోరులో చెన్నై చేతిలో చిత్తయిన ఆ టీమ్ ఆర్‌సీబీని ఓడించి కాన్ఫిడెన్స్ పెంచుకోవాలని చూస్తోంది. మరీ ఈ సీనియర్, జూనియర్ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

పటిష్టంగా ఆర్‌సీబీ..
స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌తో పాటు కొత్త టీమ్‌లోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఓ రేంజ్‌లో విజృంభించడంతో ఆర్‌సీబీ ఫుల్ జోష్‌లో ఉంది. ఇద్దరూ భీకర ఫామ్‌లో ఉండగా.. ఫస్ట్ రెండు మ్యాచ్‌ల్లో బాగానే ఆడిన విరాట్ భారీ స్కోరు బాకీ ఉన్నాడు. ఈ ముగ్గురిలో ఏ ఇద్దరూ రాణించినా ఆర్‌సీబీకి బ్యాటింగ్‌లో తిరుగుండదు. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. మరోవైపు వాంఖడే మైదానం చిన్నది కావడంతో కివీస్ విధ్వంసకర ప్లేయర్ ఫిన్ అలెన్‌ను ఆడించే అవకాశం ఉంది. అప్పుడు పడిక్కల్ ఫస్ట్ డౌన్‌లో రావచ్చు. అదే జరిగితే గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన పటిదార్‌పై వేటు పడవచ్చు. బౌలింగ్‌లోనూ ఆర్‌సీబీకి తిరుగులేకుండాపోయింది. పేసర్లు మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నారు. కైల్ జెమీసన్ పరుగులిస్తున్నా కీలక వికెట్లు తీస్తున్నాడు. చాహల్ కూడా గాడిలో పడటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.

సంజూపైనే ఆశలు..
మరోవైపు రాజస్థాన్ టీమ్ ఆశలన్నీ ఆ జట్టు కెప్టెన్ సంజూశాంసన్‌పైనే ఆధారపడి ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్ తర్వాతి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఫెయిలయ్యాడు. సంజూ మరోసారి చెలరేగితే రాజస్థాన్ బ్యాటింగ్‌కు తిరుగుండదు. జోస్ బట్లర్, మిల్లర్ రాణిస్తున్నా.. ఇతర బ్యాట్స్‌మన్ విఫలమవుతున్నారు. గత మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన మనన్ వోహ్రాపై వేటు పడే అవకాశం ఉంది. అతని స్థానంలో యువ క్రికెటర్ యశస్వీ జైస్వాల్ బరిలోకి దిగవచ్చు. ఆల్‌రౌండర్ శివమ్ దూబేను కూడా పక్కన పెట్టవచ్చు. అతని స్థానంలో శ్రేయస్ గోపాల్‌ను తీసుకునే చాన్స్ ఉంది. ఎందుకంటే డివిలియర్స్, కోహ్లీలపై శ్రేయస్‌కు మెరుగైన రికార్డు ఉంది. ఆల్‌రౌండర్లు రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా రాణించాల్సిన అవసరం ఉంది. జయదేవ్ ఉనాద్కత్, చేతన్ సకారియా, క్రిస్ మోరీస్, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌తో బౌలింగ్ విభాగం పటిష్టంగానే ఉంది. కానీ పరుగులిచ్చుకోవడాన్ని నియత్రించుకోవాలి.

ముఖా ముఖి హోరాహోరీ..
ఇరు జట్ల మధ్య ముఖా ముఖి పోరు హోరాహోరీగా ఉంది. ఇప్పటి వరకు 23 మ్యాచ్‌లు జరగ్గా ఇరు జట్లు చెరో 10 విజయాలు సాధించాయి. మరో మూడు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. డివిలియర్స్(484), కోహ్లీ(482)కి మంచి రికార్డుంది. అయితే గత సీజన్‌లో రెండింటికి రెండు మ్యాచ్‌లు ఆర్‌సీబీనే విజయం సాధించింది. కాకపోతే ఈ సీజన్‌లో ముంబై వేదికగా ఆర్‌సీబీకి ఇదే ఫస్ట్ మ్యాచ్ కాగా.. రాజస్థాన్ ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడింది. ఇది కోహ్లీసేనకు ప్రతీకూలం కానుంది.

తుది జట్లు(అంచనా):
ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఫిన్ అలెన్, దేవదత్ పడిక్కల్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, కైల్ జెమీసన్, వాషింగ్టన్ సుందర్, షెబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వీ జైస్వాల్/మనన్ వోహ్రా, సంజూ శాంసన్(కెప్టెన్/కీపర్), శివమ్ దూబే/శ్రేయస్ గోపాల్, డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరీస్, జయదేవ్ ఉనాద్కత్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్
డ్రీమ్11 ప్రిడిక్షన్: ఏబీ డివిలియర్స్(కెప్టెన్), జోస్ బట్లర్, సంజూశాంసన్, విరాట్ కోహ్లీ(వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, మనన్ వోహ్రా, గ్లేన్ మ్యాక్స్‌వెల్, హర్షల్ పటేల్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, చేతన్ సకారియా, యుజ్వేంద్ర చాహల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications