PBKS vs CSK: నిప్పులు చెరిగిన చహర్.. చెలరేగిన అలీ, ఫాఫ్.. పంజాబ్‌పై చెన్నై ఘన విజయం!!

ముంబై: పంజాబ్ కింగ్స్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ సునాయాసంగా ఛేదించింది. 107 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి మరో 26 బంతులు ఉండగానే ఛేదించింది. స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ (46; 31 బంతుల్లో 7x4, 1x6) తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోయాడు. ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ (36; 33 బంతుల్లో 3x4, 1x6) రాణించాడు. చివరలో మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా (8), తెలుగు తేజం అంబటి రాయుడు (0) ఔట్ అయినా.. సామ్ కరన్ (5) బౌండరీ బాది మ్యాచును ముగించాడు. పంజాబ్ బౌలర్లలో మొహ్మద్ షమీ 2, మురుగన్ అశ్విన్ 1 వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో చెన్నై ఐపీఎల్ 2021లో బోణీ కొట్టింది.

బ్యాట్ జులిపించిన అలీ:
స్వల్ప లక్ష్య చేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు మొదటి మూడు ఓవర్లు ఆచితూచి ఆడారు. నాలుగో ఓవర్లో ఫాఫ్ డుప్లెసిస్ రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాది స్కోరును ముందుకు కదిపాడు. అయితే ఆరంభం నుంచి తడబడుతున్న రుతురాజ్ గైక్వాడ్ (5) ఐదవ ఓవర్లో ఔట్ అయ్యాడు. ఈ సమయంలో మొయిన్ అలీ బ్యాట్ జులిపించాడు. బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దీంతో చెన్నై స్కోర్ పరుగులు పెట్టింది. ఫాఫ్ అతనికి అండగా నిలిచాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 66 పరుగులు జోడించారు.

వరుస బంతుల్లో రైనా, రాయుడు ఔట్:
మురుగన్ అశ్విన్ వేసిన 13వ ఓవర్ మొదటి బంతికి సిక్స్ బాదిన మొయిన్ అలీ.. మూడో బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు. అనంతరం వచ్చిన సురేష్ రైనా.. బౌండరీ బాది మంచి ఊపుమీద కనిపించాడు. అయితే మొహ్మద్ షమీ వేసిన 14వ ఓవర్ మూడో బంతికి భారీ షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి బంతికే అంబటి రాయుడు డకౌట్ అయ్యాడు. చివరికి సామ్ కరన్ బౌండరీతో మ్యాచును ముగించాడు. నాలుగు వికెట్లు పడగొట్టిన దీపక్ చహర్ 'మ్యాన్ అఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకున్నాడు.

నిప్పులు చెరిగిన చహర్:
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 రన్స్ చేసింది. పంజాబ్ కింగ్స్ జట్టుకు చెన్నై పేసర్ దీపక్ చహర్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే చుక్కలు చూపించాడు. చహర్ నిప్పులు చెరిగే బంతులతో రెచ్చిపోవడంతో పంజాబ్ 26 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగింది. ఓపెనర్లు కెప్టెన్ కేఎల్ రాహుల్ (5), మయాంక్ అగర్వాల్ (0)తో పాటు హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్(10), దీపక్ హుడా (10), నికోలస్ పూరన్ (0) పూర్తిగా విఫలమయ్యారు. రాహుల్ రనౌట్ కాగా.. మిగతా అందర్నీ చహర్ పెవిలియన్ పంపాడు.

ఆదుకున్న షారుఖ్:
ఈ దశలోనే క్రీజులోకి అడుగుపెట్టిన యువ బ్యాట్స్‌మన్ షారుఖ్ ఖాన్ (47; 36 బంతుల్లో 4x4, 2x6) ధాటిగా ఆడినా.. మరో ఎండ్‌లో అతడికి సహకరించే బ్యాట్స్‌మన్ కరవయ్యారు. జే రిచర్డ్‌సన్ (15)తో కలిసి ఆరో వికెట్‌కు 31 పరుగులు.. మురుగన్ అశ్విన్ (6)తో కలిసి ఏడో వికెట్‌కు 30 పరుగులు జోడించాడు. ఇక మహ్మద్ షమీ (9)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 14 పరుగులు జోడించాడు. అయితే చివరి ఓవర్‌లో అర్ధ శతకానికి చేరువైన షారుఖ్.. జడేజా చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. దీంతో పంజాబ్ 101 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. చివరికి బౌలర్లు సింగిల్స్ తీయడంతో పంజాబ్ 106 పరుగులకు పరిమితమైంది. చెన్నై బౌలర్లలో చహర్ 4 వికెట్లు పడగొట్టగా.. సామ్ కరన్, మొయిన్ అలీ, డ్వేన్ బ్రేవో తలో వికెట్ తీశారు. చహర్ తన 4 ఓవర్ల కోటాలో కేవలం 13 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
కరోనా నుంచి కోలుకున్న టీమిండియా కెప్టెన్!!