
దుబాయ్: భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ 2021 సీజన్‌కు దూరమయ్యాడు. గాయంతో ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఇంటిదారిపట్టాడు. అతని స్థానంలో ముంబై ఇండియన్స్ మరో యువ ప్లేయర్ సిమర్‌జీత్‌ను తీసుకుంది. ఈ ఏడాది జరిగిన వేలంలో అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ అతని కనీస ధర రూ.20 లక్షలకు దక్కించుకుంది. దాంతో అతనికి ఒక్క మ్యాచ్‌లో అయినా ఆడే అవకాశం వస్తుందని అంతా భావించారు. ముంబై ప్లే ఆఫ్స్ రేసులో ముందుంటే యువ ఆటగాళ్లకు అవకాశం వచ్చేది. ఆ సమయంలో అర్జున్ను కూడా ఓ మ్యాచ్ ఆడించే వీలుండేది. కానీ ముంబై వరుస ఓటములతో ప్లే ఆఫ్స్ రేసులో వెనకపడటం వల్ల అర్జున్‌కు నిరాశ తప్పలేదు. ముంబై తరపున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అర్జున్ రెండు టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.
గాయపడిన అర్జున్ స్థానంలో యువ పేసర్ సిమర్జీత్ సింగ్‌ను ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకుంది. ఇప్పటివరకు 10 ఫస్ట్ క్లాస్, 10 లిస్ట్-ఏ మ్యాచ్‌లతో పాటు 15 టీ20లు ఆడిన సిమర్‌జిత్ 74 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల భారత జట్టు శ్రీలంక పర్యటనలో ధావన్ సేనకు నెట్‌బౌలర్‌గా సేవలందించాడు.
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చెలరేగింది. పంజాబ్ కింగ్స్‌తో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శన కనబర్చిన ముంబై 6 వికెట్లతో గెలుపొందింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్‌రమ్(42), దీపక్ హుడా(28) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ముంబై బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, కీరన్ పొలార్డ్ రెండేసి వికెట్లు తీయగా.. రాహుల్ చాహర్, కృనాల్ పాండ్యా చెరొక వికెట్ తీశారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై 19 ఓవర్లలో 4 వికెట్లకు 137 రన్స్ చేసింది. హార్దిక్ పాండ్యా(30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్), సౌరభ్ తివారీ(37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45) రాణించారు. చివర్లో కీరన్ పొలార్డ్(7 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 15 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్‌తో హార్దిక్ ఫామ్‌లోకి రావడం అటు ముంబై.. ఇటు టీమిండియా శుభపరిణామం.