IPL 2021: సంపాదనలో ధోనీ ఫస్ట్.. రోహిత్ సెకండ్!
న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో ధోనీ బరిలో దిగితే క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధికంగా రూ.150 కోట్లు వేతనం తీసుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో మొత్తం 13 సీజన్‌లు ఆడిన ధోనీ.. అత్యధికంగా రూ.137 కోట్లు వేతనంగా తీసుకున్నాడు. 2008లో ఏడాదికి రూ.6 కోట్ల చొప్పున మూడేళ్లకు రూ.18 కోట్లకు ధోనీని చెన్నై తీసుకుంది.

రూల్స్ మార్పుతో..
అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వేతనం నిబంధనల్లో సడలింపులు ఇవ్వడంతో ధోనీజీతం రూ.8.28 కోట్లకు పెరిగింది. ఈ ఒప్పందం మూడేళ్లు కొనసాగింది. 2014, 2015లలో ధోని ఏడాదికి రూ.12.5 కోట్లు సంపాదించాడు. రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ తరఫున రెండేళ్లు ఆడిన ధోనీకి రూ.25 కోట్లు లభించాయి.
2018లో మరోసారి చెన్నై పగ్గాలు చేపట్టిన ధోనీ ఏడాదికి రూ.15 కోట్లు చొప్పున మూడేళ్లలో రూ.45 కోట్లు సంపాదించాడు. 2021 సీజన్‌లోనూ ధోనీకి మరో రూ.15 కోట్లు లభిస్తాయి. దీంతో ఐపీఎల్ మొత్తంలో రూ.150 కోట్లు వేతనంగా తీసుకున్న ఆటగాడిగా ధోని రికార్డు నెలకొల్పుతాడు.

ధోనీ తర్వాత రోహిత్..
అవార్డులు, రివార్డులు అన్నీ లెక్కేస్తే ధోనీ ఆదాయం రూ.200 కోట్లు దాటొచ్చని అంచనా. ఇక ఇప్పటి వరకు రూ.131 కోట్లతో రోహిత్‌శర్మ రెండో స్థానంలో, రూ.126 కోట్లతో విరాట్ కోహ్లీ మూడో స్థానాల్లో ఉన్నారు. వచ్చే సీజన్‌లో రోహిత్‌కు ముంబై ఇండియన్స్ రూ.15 కోట్లు ఇవ్వనుండటంతో... రూ.146 కోట్లతో రోహిత్ రెండో స్థానంలో ఉంటాడు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కోహ్లీకి రూ.17 కోట్లు ఇస్తుంది. రూ.143 కోట్లతో కోహ్లీ మూడో స్థానంలో కొనసాగుతాడు. 2021 ఐపీఎల్‌లో బరిలో దిగితే సురేశ్ రైనా, డివిలియర్స్‌లు రూ.100 కోట్ల మైలురాయిని అధిగమిస్తారు.

ఏప్రిల్‌లో ఐపీఎల్ 2021
ఐపీఎల్ 2021 సీజన్ ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించేందుకు బీసీసీఐ సమయాత్తం అవుతోంది.ఇప్పటికే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కార్యచరణను ప్రారంభించింది. ఈ వారం ప్రారంభంలో ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్‌తో సమావేశమైన కౌన్సిల్ సభ్యులు.. ఐపీఎల్ 14వ సీజన్ వేలానికి సంబంధించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 11న మినీ వేలం జరుగనుంది. ఇక ఐపీఎల్ 2021 ఏప్రిల్ 10 తర్వాత ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటన ముగిసిన అనంతరం ఐపీఎల్ ఆరంభం అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే వదిలిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను ఇవ్వాలని ఆయా ఫ్రాంచైజీలకు బోర్డు సూచించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications