
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ ప్రారంభానికి చాలా రోజుల సమయమే ఉన్నా.. క్యాష్ రిచ్ లీగ్ ఫీవర్ అప్పుడే మొదలైంది. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలన్నీ సోషల్ మీడియా వేదికగా అభిమానలను అలర్ట్ చేస్తుండగా.. తాజాగా అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ కూడా రంగంలోకి దిగింది. ఐపీఎల్ 2021 సీజన్ ప్రమోషన్‌లో భాగంగా భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ప్రత్యేకమైన వీడియోలను రూపొందించింది.
ఈ వీడియోల్లో ధోనీ సన్యాసిగా కనిపించడం హాట్‌టాపిక్ అయింది. బోడి గుండుతో ఉన్న మహీ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ధోనీ ఫొటోలపై సరదా మీమ్స్, జోక్స్, కామెంట్స్ పేలుతున్నాయి. ఇక తాజాగా స్టార్ స్పోర్ట్ రిలీజ్ చేసిన ఓ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హిట్ మ్యాన్ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేస్తుంది.
ఈ వీడియోలో కొంత మంది పిల్లలకు గురువుగా ఉన్న ధోనీ.. రోహిత్ శర్మ ఐపీఎల్ సక్సెస్‌ను ఓ కథలా వారికి వినిపించాడు. 'ఈ రోజు టాపిక్ అత్యాశ. ఇది హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కథ. ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ఐపీఎల్ టైటిల్‌ను ఐదుసార్లు గెలిచినప్పటికీ.. అతనికి ఇంకా ఆశ తీరలేదు.'అని పిల్లలకు తెలిపాడు. దీంతో ఓ పిల్లవాడు ఆత్యాశగా ఉండడం మంచిది కాదా..! అని అడగగా ధోనీ కాదు.. అత్యాశగా ఉండడం కూల్ అని సమాధానమిచ్చాడు. వివో ఐపీఎల్‌లో ఇది భారత్ కొత్త మంత్రమని తెలిపాడు. అంతేకాకుండా హిట్‌మ్యాన్ మళ్లీ హ్యాట్రిక్ కొడతాడా ..? అన్న ప్రశ్నకు ధోని సమాధానమిస్తూ.. దీనికి సమయమే సమాధానం తెలియజేస్తుందని తెలిపాడు.
ఇక మరో వీడియోలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఘనతను మహీ చెప్పుకొచ్చాడు. టీచర్‌గా తన విద్యార్థులకు విరాట్ కోహ్లీ, కింగ్ కోహ్లీగా ఎలా మారాడో వివరించాడు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఇక ఐపీఎల్ 2021 సీజన్ ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు జరుగనుంది. ఈ టోర్నమెంట్ 6 వేర్వేరు వేదికలలో జరుగనుండగా, ప్రతి జట్టు 4 వేదికల్లో ఆడతాయి. ఈ సారి ఐపీఎల్‌లో ఏ జట్టుకు హోమ్ గ్రౌండ్‌లో ఆడే అవకాశం లేదు.
ఐపీఎల్ 2020 మాదిరిగానే మ్యాచ్‌లు సాయంత్రం 7:30 గంటలకు, మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతాయి. ప్లేఆఫ్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. మొదటి క్వాలిఫయర్స్ మే 25, రెండో క్వాలిఫయర్స్ మ్యాచ్ 28 తేదీల్లో జరుగనున్నాయి. ఎలిమినేటర్ మే 26న, ఫైనల్ మ్యచ్ మే 30న జరగనుంది.