
కోహ్లీ X రోహిత్..
ఐపీఎల్ 2021 సీజన్‌కు అదిరిపోయే ఆరంభం ఇచ్చేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ సిద్దమయ్యారు. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య శుక్రవారం రాత్రి 7.30 గంటలకు చెపాక్ స్టేడియం వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నారు. ఆరో టైటిల్‌పై కన్నేసిన ముంబై.. ఫస్ట్ టైటిల్ వేటలో ఉన్న బెంగళూరు మధ్య రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. చెపాక్ స్పిన్ వికెట్ పై బోణీ కొట్టేది ఎవరో చూడాల్సి ఉంది.

రోహిత్‌కు జోడీ ఎవరు?
ముంబై ఇండియన్స్ టీమ్ అన్ని ఏరియాల్లో బలంగా కనిపిస్తోంది. రోహిత్, సూర్యకుమార్, ఇషాన్ కిషన్‌తో టాపార్డర్ బలంగా ఉండగా.. పొలార్డ్, పాండ్యా బ్రదర్స్‌తో మిడిలార్డర్ కూడా పటిష్టంగా ఉంది. అయితే కెప్టెన్ రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించేది ఎవరనేదానిపై సస్సెన్స్ నెలకొంది. రెగ్యులర్ ఓపెనర్ క్వింటన్ డికార్ సౌతాఫ్రికా నుంచి నేరుగా చార్టెడ్ ఫ్లైట్‌లో ఇటీవలే చెన్నై చేరుకున్నాడు. తను క్వారంటైన్‌లో ఉండాలంటే మాత్రం ఈ మ్యాచ్‌కు దూరమవుతాడు. అప్పుడు ఇషాన్ కిషన్, క్రిస్‌లిన్‌లో ఒకరు ఓపెనర్‌గా వస్తారు. ఫామ్ పరంగా కిషన్‌కు ఎక్కువ చాన్స్ ఉంది. ఇక రెగ్యులర్ స్పిన్నర్లు పీయూష్ చావ్లా, రాహుల్ చహర్‌లో ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి. ముగ్గురు పేసర్ల వ్యూహంతో బరిలోకి దిగితే రోహిత్ ముందు మరో సవాల్ ఉండనుంది. బుమ్రా, బౌల్ట్‌లతో పాటు బరిలోకి దిగే మూడో పేసర్‌ను ఎంచుకోవాలి. గతంలో ఈ ప్లేస్‌లో ఆడే ప్యాటిన్సన్ ఈ సీజన్‌కు లేకపోవడం సమస్యగా మారింది.

మ్యాక్స్‌వెల్‌పై భారీ అంచనాలు..
ఆర్‌సీబీకి కూడా ఓపెనింగ్ కాంబినేషన్ సమస్య ఉంది. విరాట్ కోహ్లీ భాగస్వామి ఎవరనేది చూడాల్సి ఉంది. కరోనా నెగటివ్‌గా తేలి బుధవారమే టీమ్‌తో కలిసిన దేవదత్ పడిక్కల్‌ను బరిలోకి దించకుంటే కోహ్లీకి కొత్త పార్టనర్‌ను వెతకాలి. ఈ స్లాట్ కోసం అన్‌క్యాప్ట్ ప్లేయర్ మహ్మద్ అజారుద్దీన్ రేసులో ఉన్నాడు. పడిక్కల్ తుది జట్టులో ఉంటే వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అయిన ఆజార్ మిడిలార్డర్‌లో ఆడుతాడు. ఇక డివిలియర్స్, గ్లేన్ మ్యాక్స్‌వెల్‌తో మిడిలార్డర్ బలంగా ఉంది. ముఖ్యంగా మ్యాక్సీపై భారీ అంచనాలున్నాయి. ఈ ఆల్‌రౌండర్ తమ రాత మారుస్తాడని ఆర్‌సీబీ చాలా నమ్మకంగా ఉంది.

పిచ్ రిపోర్ట్/ముఖాముఖి:
చెపాక్ పిచ్ కొంచెం బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉంటుంది. స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తుంది. అయినా 150కి పైగా స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖాముఖి రికార్డులో బెంగళూరుపై ముంబైదే పైచేయి. ఇరు జట్లు ఇప్పటి వరకు 27 సార్లు తలపడగా.. 17 సార్లు ముంబైనే విజయం సాధించింది. ఆర్‌సీబీ కేవలం 10 సార్లు మాత్రమే గెలుపొందింది. గత సీజన్‌లో మాత్రం చెరొక విజయాన్నందుకున్నాయి. ఒక మ్యాచ్ ఏకంగా సూపర్ ఓవర్‌కు దారితీసింది. అయితే గత 8 సీజన్లు ముంబై ఫస్ట్ మ్యాచ్ గెలవలేదు. మరీ ఈసారైనా శుభారంభం చేస్తుందో లేదో చూడాలి.

తుది జట్లు
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, జేమ్స్ నిషమ్, కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్ నీల్/జయంత్ యాదవ్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, ఏబీ డివిలియర్స్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ అజారుద్దీన్ (కీపర్), డానియల్ క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, కైల్ జెమీసన్, నవ్‌దీప్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్
డ్రీమ్ ఎలెవన్ ప్రిడిక్షన్
ఏబీ డివిలియర్స్, మహ్మద్ అజారుద్దీన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), గ్లేన్ మ్యాక్స్‌వెల్(వైస్ కెప్టెన్), హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, రాహుల్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా


Click it and Unblock the Notifications
