
ముంబై: బౌలర్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడం ఎలాగో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి బాగా తెలుసని ఆ జట్టు స్పిన్ ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్ అన్నాడు. ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ 2021 సీజన్ మినీ వేలంలో కృష్ణప్ప గౌతమ్‌ను సీఎస్‌కే రూ.9.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దాంతో తొలిసారి చెన్నై జట్టుకు, ధోనీ సారథ్యంలో కృష్ణప్ప గౌతమ్ ఆడబోతున్నాడు. ఇప్పటికే చెన్నై టీమ్‌తో చేరిన గౌతమ్.. ముంబై వేదికగా ఆ ఫ్రాంచైజీ ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంప్‌లో ముమ్మరంగా సాధన చేస్తున్నాడు.
తాజాగా ధోనీ కెప్టెన్సీ గురించి మాట్లాడిన ఈ కర్ణాటక క్రికెటర్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీలో ఆడటాన్ని బౌలర్లు బాగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే.. అతను బౌలర్ల బలాన్ని చక్కగా అర్థం చేసుకుంటాడు. అలానే బౌలర్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడం ఎలాగో ధోనీకి బాగా తెలుసు.'అని కృష్ణప్ప గౌతమ్ పేర్కొన్నాడు.
ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తన ఫస్ట్ మ్యాచ్‌ని ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. ఈ సీజన్ కోసం మూడు వారాల క్రితమే చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ క్యాంప్ ప్రారంభించింది. నెట్స్‌లో ధోనీతో కలిసి ఇప్పటికే ప్రాక్టీస్ చేస్తున్న కృష్ణప్ప గౌతమ్.. అతనితో కలిసి ఆడాలనే చిరకాల కోరిక తీరబోతోందని ఆనందం వ్యక్తం చేశాడు. చెన్నై నుంచి చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్‌ని ఇటీవల ముంబైకి మార్చిన విషయం తెలిసిందే.