సూపర్ రెడ్డి.. ధోనీతో ఫొటో దిగితే చాలనుకున్నావ్.. అతని లెగ్ స్టంపే ఎగరగొట్టేసావ్! (వీడియో)

చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని తన జీవితంలో ఒకసారి కలిస్తే చాలనుకున్న ఓ యువ ఆటగాడు.. ఏకంగా అతని లెగ్ స్టంప్ వికెట్‌నే ఎగరగొట్టేసాడు. తన అభిమాన ఆటగాడితో ఓ ఫొటో చాలనుకున్న ఆ కుర్రాడు.. ఏకంగా అతని సారథ్యంలోనే ఆడబోతున్నాడు. అతనెవరో కాదు.. తెలుగు బిడ్డ, వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి. ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో ఈ సీమ బిడ్డను చెన్నై సూపర్ కింగ్స్ అతని కనీస ధర రూ. 20 లక్షలకు తీసుకున్న విషయం తెలిసిందే.

టైటిలే లక్ష్యంగా..
అయితే ఐపీఎల్ 2021 సీజన్ టైటిలే లక్ష్యంగా సన్నాహకాలు మొదలు పెట్టిన సీఎస్‌కే.. అన్ని ఫ్రాంచైజీల కన్నా ముందే చెన్నై వేదికగా ప్రాక్టీస్ క్యాంప్ షురూ చేసింది. ఈ క్యాంప్‌లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు ఆ జట్టు ఆటగాళ్లు అంబటి రాయుడు, రుతురాజ్ గైక్వాడ్, ఎన్ జగదీషన్, ఆర్ సాయి కిషోర్, సి హరి నిషాంత్, హరిశంకర్ రెడ్డితో పాటు మరికొంత మంది ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు.
గాల్లోకి లేచిన లెగ్ స్టంప్..
అయితే ఈ ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా 22 ఏళ్ల హరిశంకర్ రెడ్డి సూపర్బ్ బౌలింగ్‌తో మహేంద్ర సింగ్ ధోనీని క్లీన్ బౌల్డ్ చేశాడు. మహీతో ఫొటో దిగితే చాలనుకున్న హరిశంకర్ రెడ్డి అతని లెగ్ స్టంప్ ఎగరగొట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. అతను వేసిన స్టన్నింగ్ ఇన్‌స్వింగర్‌ను తప్పుగా అంచనా వేసిన మహీ.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
దాంతో సూపర్ రెడ్డి.. ధోనీతో ఫొటో దిగితే చాలనుకున్నావ్.. అతని లెగ్ స్టంపే ఎగరగొట్టేసావ్ అంటూ అభిమానులు అభినందిస్తున్నారు. చెన్నై ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రాక్టీస్‌లో అదరగొడుతున్న హరిశంకర్ రెడ్డికి తుది జట్టులో అవకాశం దొరుకుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రైతు బిడ్డ..
హరిశంకర్ రెడ్డి పక్కా రైతు బిడ్డ. అతని తల్లిదండ్రులకు వ్యవసాయం తప్ప వేరే పనే తెలియదు. వారికి ఇద్దరు సంతానం కాగా, పెద్ద కుమారుడు ఉపాధి నిమిత్తం కువైట్‌లో స్థిరపడ్డాడు. హరిశంకర్ రెడ్డి డిగ్రీ వరకు సరదాగా చదువుకున్నాడు. కానీ, స్నేహితులతో కలిసి ఎప్పుడూ క్రికెట్ మైదానాల చుట్టూ తిరిగేవాడు. ఎలాంటి పని లేకుండా, క్రికెట్ ధ్యాసతోనే పెరిగిన తమ కుమారుడు ఈ స్థాయికి ఎదుగుతాడనుకోలేదంటూ తల్లిదండ్రులు రామచంద్రారెడ్డి, లక్ష్మీదేవి ఆనందం వ్యక్తం చేశారు.
తమ కుమారుడు ఎప్పుడూ క్రికెట్ బ్యాటు, బాలు పట్టుకుని తిరిగే వాడని, ఎమైపోతాడోనని అనుకున్నామని లక్ష్మీదేవి చెప్పారు. బడికి పొమ్మన్నా, లేదా పొలం పనికి రావాలన్నా వినకుండా ఎప్పుడూ క్రికెట్ అంటూ ఊళ్లు పట్టుకుని తిరిగేవాడని వివరించారు. ఇలా తిరుగుతున్న తమ కుమారుడిని, తల్లిదండ్రులుగా తమను గ్రామస్తులు కూడా సూటిపోటి మాటలు అనేవారన్నారు. కానీ, ఈరోజు తన కుమారుడు సాధించిన ఘనత గురించి అందరూ చెప్పుకుంటుంటే సంతోషంగా, గర్వంగా ఉందని ఐపీఎల్ 2021 వేలంలో ఎంపికైన సందర్భంగా మీడియాతో సంతోషం వ్యక్తం చేశారు.

ఒక ఫొటో దిగితే చాలనుకున్నా..
చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ఎంపికవడంపై హరిశంకర్ రెడ్డి కూడా సంతోషం వ్యక్తం చేశాడు. ధోనీతో ఒక్క ఫొటో దిగితే చాలనుకున్న తాను.. ఇప్పుడు ఆయనతో కలిసి ఆడబోతున్నానని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ ఐపీఎల్‌లో ధోనీ నుంచి ఎన్నో నేర్చుకోవచ్చని ఈ కుడిచేతి పేసర్ చెప్పుకొచ్చాడు. చిన్నప్పటి నుంచి తమతో పాటు అటలాడిన స్నేహితుడు జాతీయ స్థాయికి ఎదగడంపై అతడి మిత్రులు హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే జాతీయ జట్టులోనూ స్థానం దక్కించుకునే స్థాయికి హరిశంకర్‌రెడ్డి ఎదుగుతాడని గ్రామస్థులు, స్నేహితులు ఆశాభావం వ్యక్తం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications