IPL 2021 Suspeneded:ఐపీఎల్ 2021 వాయిదా..బుడగ బద్దలవడానికి అసలు కారణాలు వెలుగులోకి!అవేంటంటే?

హైదరాబాద్: ఒక వారం కిందివరకు కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సజావుగా సాగింది. బయోసెక్యూర్ బబుల్ పరిమితుల్లో ఆటగాళ్లు అందరూ పూర్తిగా సురక్షితంగా ఉన్నారని ఐపీఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కూడా ఓ ప్రకటన చేశాడు. వారం తిరిగేలోగా పరిస్థితులు తారుమారు అయ్యాయి. మంగళవారం అనూహ్య పరిస్థితుల్లో ఐపీఎల్ 2021ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ పేర్కొంది. కేకేఆర్, సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్, ఢిల్లీ జట్లలోని ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది వైరస్ బారిన పడడంతో.. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన బీసీసీఐ ముందు జాగ్రత్తగా లీగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

బోర్డు చేసిన తప్పిదాలేనా
అత్యంత సురక్షితమని భావించిన బయో బబుల్‌లో పాజిటివ్ కేసులు బయటపడడం అనేక అనుమానాలకు తావిస్తోంది. లీగ్ మధ్యలో కరోనా కేసులు ఎలా వెలుగు చూశాయన్నది ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. అయితే బీసీసీఐ బోర్డు చేసిన తప్పిదాల కారణంగానే బుడగ బద్దలైందని సమాచారం.
గత ఏడాది యూఏఈలో ఎంతో పకడ్బందీగా బయో బుడగను ఏర్పాటు చేసి రెండు నెలల పాటు విజయవంతంగా లీగ్‌ను నిర్వహించారు. 2020 లీగ్ ఆరంభానికి ముందు కొన్ని కేసులు వెలుగు చూసినా.. అవి ఆటగాళ్లు, సిబ్బంది క్వారంటైన్ ప్రక్రియ మొదలు కావడానికి ముందే, విమాన ప్రయాణాల కారణంగా బయటపడ్డవి. అందరిని క్వారంటైన్‌లో ఉంచి.. మెరుగైన వైద్యం అందించారు. అంతటితో వైరస్‌కు అడ్డుకట్ట వేశారు.

అత్యంత జాగ్రత్తగా 2020
ఇక ఐపీఎల్ 2020 లీగ్ మొదలయ్యాక వైరస్ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. అప్పుడు బ్రిటన్‌కు చెందిన రెస్ట్రారా అనే కంపెనీకి బబుల్ బాధ్యతలు అప్పగించారు. ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది, మైదాన, హోటళ్ల నిర్వాహకులు.. ఇలా లీగ్‌లో భాగమైన అందరినీ బుడగలోకి తీసుకొచ్చింది ఆ కంపెనీ. బయటి వ్యక్తులు ఎవ్వరూ బుడగ లోపలికి రాకుండా అత్యంత జాగ్రత్తగా చూసుకుంది. అలాగే మూడు వేదికలకే (దుబాయ్, అబుదాబి, షార్జా) మ్యాచ్‌లు పరిమితం చేశారు. విమాన ప్రయాణాల అవసరం లేకుండా రోడ్డు మార్గాల్లోనే ఒక వేదిక నుంచి మరో వేదికకు వెళ్లేలా ఏర్పాట్లు చేసుకోవడంతో ఎక్కడా ఎవరికీ వైరస్ సోకకుండా చూసుకుంది.
IPL 2021: వైద్యుల నిస్సహాయత నన్ను చంపేస్తోంది: అశ్విన్

ఉమ్మడి బయో బబుల్ కాదు
ఇప్పుడు స్వదేశంలో పకడ్బందీగా బబుల్ లేకపోవడం వల్లే ఐపీఎల్ 2021 అర్ధంతరంగా ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం అందరికీ కలిపి ఉమ్మడి బయో బబుల్ ఏర్పాటు చేయకపోవడమే అసలు సమస్య. ఆయా ఫ్రాంఛైజీలు తమ తమ పరిధిలో బబుల్ ఏర్పాటు చేసుకున్నాయి. మైదానాలకు, జట్లు బస చేసే హోటళ్లకు మధ్య ఎక్కువ దూరం ఉండటం.. హోటళ్ల సిబ్బందిపై పర్యవేక్షణ కొరవడటం, వారికి నిర్బంధ క్వారంటైన్ లేకపోవడం.. అలాగే మైదానాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న సిబ్బందిలో ఎవరూ బబుల్ నిబంధనలు పాటించకపోవడం లాంటివి ఆటగాళ్లకు కరోనా సోకేలా చేసింది.

ఆన్‌లైన్‌లో భోజనం
ఐపీఎల్ 2021ను ఒకట్రెండు వేదికలకు పరిమితం చేయకుండా.. ఆరు నగరాలను ఎంపిక చేయడంతో మధ్యలో మూడుసార్లు ఆటగాళ్లు, సిబ్బంది ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. చెన్నై, ముంబైల్లో మ్యాచ్‌లు అయ్యాక అందరూ విమానాల్లో ప్రయాణాలు చేసిన కొన్ని రోజులకే కరోనా కేసులు బయటపడటాన్ని బట్టి ఆ సమయంలోనే వైరస్ వ్యాప్తి జరిగి ఉండొచ్చు.
ఇక వారం రోజుల క్రితం వరకు కూడా క్రికెటర్లు తాము ఉంటున్న నగరంలో ఎక్కడి నుంచైనా నచ్చిన భోజనాన్ని ఆన్‌లైన్ ఆర్డర్ ద్వారా తెప్పించుకునే అవకాశం కల్పించారు. మరోవైపు నిబంధనలు పాటించకుండా బయటి వ్యక్తులు కూడా క్రికెటర్లను కలవగలిగారని తెలుస్తోంది. ఇలాంటి పలు కారణాలతో కరోనా క్రికెటర్ల వరకు చేరిందనేది వాస్తవం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications