IPL 2021 Final: తెలుగులో మాట్లాడిన దినేశ్ కార్తీక్.. ఫ్యాన్స్ ఫిదా!(వీడియో)

దుబాయ్: ఐపీఎల్ 2021 సీజన్ ఫైనల్ సందర్భంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ మాజీ కెప్టెన్, టీమిండియా వెటరన్ ప్లేయర్ దినేశ్ కార్తీక్ తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఈ మెగా ఫైనల్లో టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు చానెల్ కోసం మాట్లాడిన డీకే.. ఎలాంటి తడబాటు లేకుండా స్పష్టమైన ఉచ్చారణతో ఆకట్టుకున్నాడు. ప్రముఖ కామెంటేటర్, తెలుగువాడైన హర్షా భోగ్లే అడిగిన ప్రశ్నలకు దినేశ్ కార్తీక్ బదులిచ్చాడు.
ఫైనల్ చేరడం అద్భుతం..
మెగా ఫైనల్ అని ఏమైనా ఒత్తిడి ఉందా? అని ప్రశ్నించగా.. అలాంటిదేం లేదని, తాము ఓ సాధారణ మ్యాచ్‌లానే ఈ టైటిల్ ఫైట్‌ను చూస్తున్నామని చెప్పాడు. అయితే ఫైనల్ అంటే సహజంగా ఎవరికైన ఒత్తిడి ఉంటుందని, దాన్ని అధిగమించడానికి ప్రాక్టీస్ చేశామని, సరైన ప్రణాళికలతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. ఇక కేకేఆర్ సెకండాఫ్‌లో అద్భుతం చేసిందని, ఫస్టాఫ్ ముగిసే సరికి పాయింట్స్ టేబుల్లో ఏడో స్థానంలో నిలిచామని చెప్పాడు. అక్కడి నుంచి నేడు ఫైనల్ ఆడుతున్నామంటే ఆటగాళ్లు ఎంతో కష్టపడ్డారని తెలిపాడు. అనేక ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడామని, వాటి వల్ల వెంకటేశ్ అయ్యర్ నైపుణ్యం తెలిసిందన్నాడు.
కీపర్‌గా అది నా బాధ్యత..
జట్టులో ప్రతీ ఆటగాడికి తమ రోల్ ఏంటో తెలుసున్నాడు. వెంకటేశ్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ మంచి స్ట్రైక్ రొటేట్ చేస్తూ శుభారంభాలు అందిస్తున్నారని చెప్పాడు. రాహుల్ త్రిపాఠి ప్రత్యేకమైన ఆటగాడని వాడి గేమ్ వాడికి తెలుసని పేర్కొన్నాడు. నితీష్ రాణా ఏ స్థానంలోనైనా ఆడగలుగుతాడని, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తీ, షకీబ్ అల్ హసన్ అద్భుతంగా రాణిస్తున్నారని చెప్పాడు. ఇక మైదానంలో కెప్టెన్ కంటే మీరే ఎక్కువగా చురుగ్గా ఉంటున్నారని ప్రశ్నించగా.. కీపర్‌గా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని చెప్పాడు. బ్యాట్స్‌మన్ ఎలాంటి షాట్స్ ఆడుతున్నాడు. ఎలాంటి ఫీల్డ్ సెటప్ చేయాలి, ఏ బంతులు వేయాలనే విషయాలను తమ ఆటగాళ్లతో పంచుకుంటున్నాని చెప్పాడు.
తెలుగు ఫ్యాన్స్ ఫిదా..
ఇక దినేశ్ కార్తీక్ తెలుగులో మాట్లాడటం పట్ల తెలుగు రాష్ట్రాల అభిమానులు ఫిదా అవుతున్నారు. డీకే తెలుగు అద్భుతంగా ఉందని మెచ్చుకుంటున్నారు. దినేశ్ కార్తీక్ తెలుగులో మాట్లాడిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. అచ్చం తెలుగు వాళ్లలానే మాట్లాడుతున్నారని అభినందిస్తున్నారు. కొందరు సీఎస్‌కే అభిమానులైతే.. అభిమాన క్రికెటర్, తెలుగు మాట్లాడిన వ్యక్తి ఎవరు గెలుపు కోరుకోవాలో అర్థం కావడం లేదని కామెంట్ చేశాడు. తెలుగులో మాట్లాడినందుకైనా దినేశ్ కార్తీక్ టైటిల్ గెలవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. హర్షా భోగ్లే సైతం డీకేను మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. తెలుగు ఇంటర్వ్యూ చేస్తానని కలలో కూడా అనుకోలేదని చెప్పాడు.
ధోనీ300
వికెట్ డ్రైగా ఉండటంతో పాటు డ్యూ ప్రభావం ఉండనున్న నేపథ్యంలోనే ఫీల్డింగ్ ఎంచుకున్నానని కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. ఎలాంటి మార్పుల్లేకుండానే ఈ మ్యాచ్ బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. దాంతో విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆండ్రీ రస్సెల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఇక తాము టాస్ గెలిచినా ఫీల్డింగ్ ఎంచుకునేవాళ్లమని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ తెలిపాడు. ఎలాంటి మార్పుల్లేకుండా విన్నింగ్ టీమ్‌తోనే బరిలోకి దిగుతున్నామన్నాడు. దాంతో కీలక మ్యాచ్‌లో కూడా సురేశ్ రైనాకు చోటు దక్కలేదు. ఇక టీ20ల్లో కెప్టెన్‌గా ధోనీకిది 300వ మ్యాచ్ కావడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications