
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 మలిదశ లీగ్‌కు మరో నాలుగు రోజుల్లో తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ ధనాధన్ లీగ్ మొదలవ్వనుంది. అయితే కరోనా పరిస్థితుల్లో ఇన్నాళ్లు ప్రేక్షకుల్లేకుండానే మ్యాచ్‌లు జరగ్గా.. మలిదశ మ్యాచ్‌లు మాత్రం అభిమానుల సమక్షంలో జరగనున్నాయి.
యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ సెకెండ్ ఫేజ్ మ్యాచ్‌లను వీక్షించడానికి పరిమిత సంఖ్యలో అభిమానులును అనుమతిస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. యూఏఈలో కోవిడ్ పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో.. ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ పేర్కొంది. ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్‌కు సంబంధించిన టికెట్లు www.iplt20.com. అఫిషియల్ వెబ్‌సైట్‌తో పాటు PlatinumList.net. వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఆటగాళ్లకు దూరంగా ఉండే విధంగా పై వరుసల్లోని టికెట్లను మాత్రమే అమ్మనున్నారు.
హోరాహోరీగా సాగిన భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కరోనా కారణంగా అర్ధంతరంగా ముగియగా.. ఇప్పుడు అందరి దృష్టి ఐపీఎల్ 2021 మలిదశ లీగ్‌పై పడింది. భారత జట్టు కోచ్‌లు కరోనా బారిన పడటంతో ఐదో టెస్టు ఆగిపోగా.. అనుకున్నదానికంటే ముందుగానే టీమిండియా ఆటగాళ్లు అరబ్ గడ్డపై అడుగు పెట్టారు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లని ప్లేయర్లు, మాజీలు, యంగ్‌స్టర్స్ ఇప్పటికే దుబాయ్, అబుదాబీలోని తమ బేస్‌లో సన్నాహకాల్లో నిమగ్నమయ్యారు.
ఇప్పుడు టీమిండియా స్టార్స్‌తో పాటు పలువురు విదేశీ ఆటగాళ్లు కూడా యూఏఈ చేరుకోవడంతో ఐపీఎల్ సందడి మొదలైంది. మైదానం ప్రాక్టీస్‌లో కొందరు, నెట్స్‌లో మరికొందరు, క్వారంటైన్‌లో ఉన్నప్పటికీ హోటల్‌లోని జిమ్స్‌లో ఇంకొందరు చెమటలు చిందిస్తూ.. మెగా లీగ్ కోసం సిద్దమవుతున్నారు. అదే సమయంలో టీమ్ బాండింగ్‌పై కూడా ఫ్రాంచైజీలు దృష్టి పెట్టాయి. ప్రాక్టీస్ తర్వాత టీమ్‌మేట్స్ అంతా ఆట, పాటలతో సేదతీరుతున్నారు. ఆదివారం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరుతో సెకండ్ ఫేజ్‌కు తెరలేవనుంది.
ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌కు ముందు కంగారు పడుతున్న ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఊరట లభించింది. శ్రీలంక-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న సిరీస్‌తో పాటు కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ఆడుతున్న వివిధ ఫ్రాంచైజీల ప్లేయర్లు యూఏఈ చేరుకున్న తర్వాత ఆరు రోజుల క్వారంటైన్ రూల్ పాటించాల్సిన అవసరం లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తెలిపింది. సదరు ప్లేయర్లను ఫ్రాంచైజీలు.. ప్రత్యేక విమానాల్లో ఇక్కడికి తీసుకొస్తున్న నేపథ్యంలో వాళ్లు రెండు రోజుల క్వారంటైన్‌లో ఉంటే సరిపోతుందని బోర్డు చెప్పింది. దాంతో, ఈ ప్లేయర్ల లీగ్ స్టార్టింగ్ నుంచే జట్లకు అందుబాటులో ఉండనున్నారు.