IPL 2021: ఒకే నగరం.. మూడు వేదికలు.. బీసీసీఐ వ్యూహం!

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్‌ను కేవలం ఒకే నగరానికి పరిమితం చేయనున్నారా? గోవాలో ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్)ను నిర్వహించినట్లుగానే ఐపీఎల్‌ను ముంబైలో నిర్వహించేందుకు కసరత్తు జరుగుతున్నదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐపీఎల్ 2021లో తొలి అంకం అయిన మినీ వేలం పూర్తయినా, ఇంకా ఐపీఎల్ వేదికలు, షెడ్యూల్‌పై స్పష్టత రాలేదు.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైనా, కరోనా కేసులు ఇంకా నమోదవుతుండటం, విదేశీ ప్రయాణాలు చేసే వారిపై ఆంక్షలు కొనసాగుతుండటం, పలు నగరాల్లో బహిరంగ సభలు, క్రీడలకు ఇంకా అనుమతులు మంజూరు చేయకపోవడంతో ఐపీఎల్‌ను ఒకే నగరానికి పరిమితం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. సాధారణంగా వేలం సమయంలో ఐపీఎల్ వేదికలను ప్రకటించే బీసీసీఐ, ఇంకా దీనిపై స్పష్టత ఇవ్వకపోవడానికి ఒకే నగరం వ్యూహమే కారణమని ప్రచారం జరుగుతోంది.

ఐఎస్‌ఎల్ తరహాలోనే..
ఇండియన్ సూపర్ లీగ్ 2020/21 ఫుట్‌బాల్ సీజన్‌ను ప్రస్తుతం గోవాలోని మూడు స్టేడియాల్లో నిర్వహిస్తున్నారు. 11 జట్లు పాల్గొంటున్న ఈ ఫుట్‌బాల్ లీగ్‌ను ఒకే నగరంలో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇదే వ్యూహాన్ని ఐపీఎల్‌కు కూడా అనుసరించాలని బీసీసీఐ భావిస్తున్నది. ఏడాది తర్వాత భారత్‌లో అంతర్జాతీయ క్రికెట్ మొదలైంది. ఇంగ్లండ్ జట్టు భారత్ పర్యటనకు వచ్చింది. అయితే, ఇంగ్లండ్ పర్యటనను మొత్తం మూడు వేదికలకే బీసీసీఐ పరిమితం చేసింది. తొలి రెండు టెస్టులు చెన్నైలో, మిగిలిన రెండు టెస్ట్‌లు, ఐదు టీ20లు అహ్మదాబాద్‌లో, మూడు వన్డేలు పూణేలో నిర్వహిస్తున్నది.

ఖర్చుతో ఉన్నా..
వేర్వేరు నగరాల్లో బయోబబుల్ వాతావరణం ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంతేకాకుండా క్రికెటర్లు ఒకటి రెండు రోజులకే బయోబబుల్ వదిలి వెళ్లడం కూడా కుదరదు. అందుకే ఒకే నగరంలో నిర్వహిస్తే బయోబబుల్ ఏర్పాటు ఖర్చు తక్కువగా ఉండటమే కాకుండా, ప్రయాణాలు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకే ముంబైలోని వాంఖడే, డీవై పాటిల్, బ్రబౌర్న్ స్టేడియాల్లో ఐపీఎల్ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే విషయంపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

ఫ్రాంచైజీల అభ్యంతరం..
చెన్నైలో జరిగిన మినీ వేలం సమయంలో అన్ని ఫ్రాంచైజీలు తమ హోం గ్రౌండ్స్‌కు తగినట్లుగా ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇప్పుడు ఒకే నగరంలో ఐపీఎల్ నిర్వహిస్తామంటే ఫ్రాంచైజీలు ఒప్పుకునే అవకాశం లేదు. ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లను ముంబైలో ప్లే ఆఫ్ మ్యాచ్‌లను అహ్మదాబాద్‌లోని మొతేరాలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్ట్ జిందాల్ చెబుతున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో బీసీసీఐ ఇదే పద్దతిని అనుసరించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ, అన్ని ఫ్రాంచైజీలు ఈ పద్దతికి ఒప్పుకునేందుకు సిద్దంగా లేవని జిందాల్ అంటున్నారు.

అభిమానులకు నిరాశే..
ఫ్రాంచైజీలు ఒప్పుకోకుంటే, ఎవరి హోం గ్రౌండ్‌లో వాళ్లే బయో బబుల్ వాతావరణాన్ని సృష్టించుకోవాలని బీసీసీఐ కోరే అవకాశం ఉన్నది. కానీ, అది ఆయా ఫ్రాంచైజీలకు భారంగా మారవచ్చు. దీంతో బీసీసీఐ నిర్ణయంపై ఫ్రాంచైజీలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తిగా మారింది. త్వరలో ఐపీఎల్ ద్వారా క్రికెట్‌ను స్టేడియాల్లో ప్రత్యక్షంగా చూడొచ్చని ఆశిస్తున్న అభిమానులకు కూడా ఈ ఒకే నగరం వ్యూహం నిరాశకు గురిచేసే అవకాశం ఉన్నది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications