DC vs RCB: కోహ్లీసేనను గట్టెక్కించిన మియా భాయ్.. పంత్, హెట్‌మైర్ పోరాటం వృథా!

అహ్మదాబాద్: ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో అద్భుత విజయాన్నందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన కోహ్లీసేన 1 పరుగు తేడాతో గెలుపొందింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో మియా భాయ్ మహ్మద్ సిరాజ్ సూపర్ బౌలింగ్‌తో ఆర్‌సీబీ గట్టెక్కింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 రన్స్ చేసింది. ఏబీ డివిలియర్స్(42 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75 నాటౌట్) పరుగుల విధ్వంసానికి అండగా యువ ప్లేయర్ పటిదార్(22 బంతుల్లో 2 సిక్స్‌లతో 31), గ్లేన్ మ్యాక్స్‌వెల్(20 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 25) సత్తా చాటారు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, అవేశ్ ఖాన్, రబడా, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 రన్స్ చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్(48 బంతుల్లో 6 ఫోర్లతో 58 నాటౌట్), షిమ్రన్ హెట్‌మైర్(25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో పోరాడిన ఫలితం లేకపోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 2 వికెట్లు తీయగా.. సిరాజ్, జెమీసన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో ఆర్‌సీబీ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచింది.

శుభారంభం లేదు..
172 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు శుభారంభం దక్కలేదు. కైల్ జేమీసన్ వేసిన మూడో ఓవర్‌లోనే ఓపెనర్ శిఖర్ ధావన్(6) క్యాచ్‌ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ మరుసటి ఓవర్‌లో ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్(4)ను మహ్మద్ సిరాజ్ కీపర్ క్యాచ్‌గా వెనక్కిపంపాడు. ఈ క్రమంలో కెప్టెన్ రిషభ్‌పంత్.. మరో ఓపెనర్ పృథ్వీషాతో నిదానంగా ఆడే ప్రయత్నం చేశాడు. ఇక షా కొన్ని బౌండరీలు రాబట్టడంతో పవర్ ప్లేలో ఢిల్లీ 2 వికెట్ల నష్టానికి 43 రన్స్ చేసింది. క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడీని విడదీసేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన ట్రంప్ కార్డ్ హర్షల్ పటేల్‌ను రంగంలో దింపి ఫలితాన్ని రాబట్టాడు. అతను వేసిన 8 ఓవర్‌లో పృథ్వీ షా(21) కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.

ఆదుకున్న పంత్..
అనంతరం క్రీజులోకి మార్కస్ స్టోయినిస్ రాగా.. నిదానంగా ఆడిన పంత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. సింగిల్స్ తీస్తూ మంచి బంతులను బౌండరీలకు తరలించిన ఈ జోడీ క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేసింది. కానీ మరోసారి హర్షల్‌ను రంగంలోకి దింపిన కోహ్లీ ఫలితాన్ని రాబట్టాడు. పంత్ వరుస ఫోర్లు బాదినా స్టోయినిస్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో హెట్‌మైర్ క్రీజులోకి రాగా.. సిరాజ్ వేసిన 15వ ఓవర్‌లో 6, 4 కొట్టి జోరు కనబర్చాడు. ఆ తర్వాత జేమీసన్, హర్షల్ కట్టడిగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ విజయానికి 18 బంతుల్లో 46 రన్స్ అవసరమయ్యాయి.

చెలరేగిన హెట్‌మైర్..
ఇక జేమీసన్ వేసిన 18వ ఓవర్‌లో మూడు భారీ సిక్సర్లు కొట్టిన హెట్‌మైర్ ఆశలు రెకెత్తించాడు. ఈ ఓవర్‌లో 21 రన్స్ రావడంతో ఢిల్లీ విజయానికి 12 బంతుల్లో 25 రన్స్ అవసరమయ్యాయి. హర్షల్ పటేల్ వేసిన 19 ఓవర్ మూడో బంతికి సింగిల్ తీసి హెట్‌మైర్ 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఓ బౌండరీ కొట్టడంతో ఆ ఓవర్‌లో 11 వచ్చాయి. దాంతో ఢిల్లీ విజయానికి చివరి ఓవర్‌లో 14 రన్స్ అవసరం కాగా.. సిరాజ్ సూపర్ బౌలింగ్‌తో కట్టడి చేయడంతో 12 పరగులు మాత్రమే వచ్చాయి. దాంతో ఒక్క పరుగుతో ఆర్‌సీబీ విజయాన్నందుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications