
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌కు దూరమవుతాడనే ఊహాగానాలకు తెరదించుతూ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు బయల్దేరాడు. భారత్ పర్యటనలో గజ్జ గాయానికి గురైన డేవిడ్ వార్నర్.. పూర్తిగా నయమవ్వకుండానే టెస్ట్ సిరీస్ ఆడాడు. దాంతో గాయం తిరగబెట్టి తీవ్రమైంది. ఈ నేపథ్యంలో అతను కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని, ఐపీఎల్ ఫస్టాఫ్ మ్యాచ్‌లు ఆడటం అనుమానమేనని ఊహాగానాలు వినిపించాయి.
కానీ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో దుమ్మురేపాడు. సెంచరీతో చెలరేగి ఫామ్ అందుకున్నాడు. దాంతో అతని గాయంపై జరగిన ప్రచారాలన్నీ అవాస్తవాలనే తెలిసింది. తాజాగా ఐపీఎల్ 2021 సీజన్ కోసం భారత్‌కు వస్తున్నానని వార్నరే స్వయంగా వెల్లడించడంతో హైదరాబాద్ ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. ఆస్ట్రేలియా నుంచి బయలుదేరే ముందు వార్నర్ తన కుటుంబ సభ్యులతో గడిపాడు. తన పిల్లలతో కలిసి డిన్నర్ చేశాడు. ఈ విషయాన్ని అతనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.
ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు జరిగే ఈ క్యాషిరిచ్ లీగ్ కోసం ఫ్రాంచైజీలన్నీ సమయాత్తం అవుతున్నాయి. ఇప్పటికే ఆటగాళ్లంతా ఆయా జట్లతో కలిసారు. బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం లీగ్ ఆరంభానికి ముందు ఆటగాళ్లందరూ వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. అయితే బయోబబుల్‌లో ఉన్న ఆటగాళ్లకు మాత్రం క్వారంటైన్‌ను మినహాయించారు. చెన్నై వేదికగా జరిగే సీజన్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీకొట్టనుంది. ఏప్రిల్ 11న ఇదే వేదికగా జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.