
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ పేరు చెప్పగానే అందరికి ఎక్కువ గుర్తొచ్చేది అతని ట్రేడ్ మార్క్ హెలికాప్టర్ షాట్! ఇప్పుడు ఆ పేరుతోనే చాక్లెట్లు రాబోతున్నాయి. ముంబైకి చెందిన 7ఇంక్‌బ్రూస్ అనే ఫుడ్ అండ్ బేవరేజెస్ సంస్థ ధోనీ హెలికాప్టర్ షాట్ పేరిట ఈ చాక్లెట్లను మార్కెట్లోకి తీసుకొస్తోంది. మంగళవారం ఈ కొత్త బ్రాండ్‌ను విడుదల చేశారు.
ఈ కంపెనీలో ధోనీ కూడా భాగస్వామి కావడం విశేషం. మోహిత్ భాగ్‌చంద్రానీ, అదిల్ మిస్త్రీ, కునాల్ పటేల్ ఆధ్వర్యంలోని ఈ సంస్థ.. మహి హెలికాప్టర్ షాట్‌తో పాటు అతడి జెర్సీ నంబర్-7 స్ఫూర్తితో 'కాప్టర్-7' అనే పేరిట ఈ చాక్లెట్లను తయారు చేస్తోంది. ఇప్పటికే ఈ బ్రాండ్‌ను ముంబై, గోవా, బెంగళూరులో ప్రారంభించారు. ధోనీ స్వస్థలం జార్ఖండ్‌తో పాటు ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, పంజాబ్‌లోనూ త్వరలో ఈ చాక్లెట్లు విడుదల కాబోతున్నాయి. ప్రముఖ వంటల నిపుణుడు డేవిడ్ బెలోతో కలిసి ఈ చాక్లెట్లను తయారు చేస్తున్నారు.
ప్రస్తుతం ఐపీఎల్ 2021 సీజన్ కోసం మహీ సిద్దమవుతున్న విషయం తెలిసిందే. గత సీజన్ ఘోరపరాభావం నుంచి తేరుకొని ఈ సారి టైటిలే లక్ష్యంగా సీఎస్‌కే సన్నదమవుతుంది. గతేడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనికి బహుషా ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కావొచ్చు. ఈ క్రమంలోనే టైటిల్ గెలిచి సగర్వంగా ఆటకు అల్విదా ప్రకటించాలని మహీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ముంబై వేదికగా సీఎస్‌కే ప్రాక్టీస్ క్యాంప్‌లో మహీ సహచర ఆటగాళ్లతో కలిసి చెమటోడుస్తున్నారు.
షేన్ వాట్సన్, కేదార్ జాదవ్, హర్భజన్ సింగ్ లాంటి సీనియర్లు దూరమయినా.. ఐపీఎల్ 2021 కోసం కొత్తగా మొయిన్ అలీ, క్రిష్ణప్ప గౌతమ్ లాంటి స్టార్ ప్లేయర్స్ చెన్నై టీమ్‌తో చేరారు. ఇద్దరూ బ్యాటింగ్, బౌలింగ్ చేయడం చెన్నైకి కలిసొచ్చే అంశం. అయితే ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ మాత్రం 14వ సీజన్‌కు దూరమయ్యాడు. వరుస బబుల్స్‌కు బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో గడపాలని అనుకుంటున్నట్లు హేజిల్‌వుడ్ స్పష్టం చేశాడు. ఈ నెల 10న ఢిల్లీతో తొలి మ్యాచ్ ఆడనున్న చెన్నై.. ముంబైలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది.