
చెన్నై: టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ వేయించుకున్నాడు. మంగళవారం తన స్వస్థలమైన చెన్నైలో టీకా తీసుకున్నాడు. అతనితో పాటు ఇతర క్రికెటర్లు జస్‌ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్, సిద్ధార్థ్ కౌల్, మహిళా క్రికెటర్ స్మృతి మంధానలు కూడా తమ స్వస్థలాల్లో వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రతిఒక్కరూ టీకా వేసుకోవాలని సోషల్ మీడియా వేదికగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ, చేతేశ్వర్ పుజారా, అజింక్యా రహానె, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, శిఖర్ ధావన్ కూడా టీకా తొలి డోస్ వేయించుకున్నారు.
టీకా వేయించుకుంటున్న ఫొటోను కార్తీక్ ట్వీట్ చేయగా.. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ లిన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఈ ఫొటోలో కార్తీక్ బ్లాక్ టీషర్ట్, జాగర్స్ ప్యాంట్ ధరించగా.. లిన్ తన మాజీ కెప్టెన్‌ను ట్రోల్ చేశాడు. సరైన ప్యాంట్ వేసుకోవచ్చుగా అనే అర్థం 'మొత్తానికి ప్యాంట్ వేసుకున్నావా?' అని కామెంట్ చేసి కార్తీక్‌ను ఆటపట్టించాడు. దినేశ్ కార్తీక్, క్రిస్ లిన్ రెండేళ్ల పాటు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వీరు డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నారు.
2018 నుంచి కార్తీక్ కేకేఆర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించగా.. అతని సారథ్యంలో రెండేళ్లు ఆడాడు లిన్... ఆ ఏడాదితో పాటు 2019లోనూ నిరాశపర్చాడు. దాంతో కేకేఆర్ అతన్ని వదులుకుంది. ప్రస్తుతం అతను ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన లిన్ 49 పరుగులతో రాణించాడు.