
న్యూఢిల్లీ: కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్‌ను యూఏఈ వేదికగా సెప్టెంబర్-అక్టోబర్‌లో నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సిద్దమైన విషయం తెలిసిందే. ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల చేసిన బోర్డు.. షెడ్యూల్‌ను రూపొందించే పనిలో పడింది. అయితే రెండో దశ మ్యాచ్‌లకు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఆయా దేశాలకు ద్వైపాక్షిక సిరీసులు ఉండటంతో యూఏఈకి వెళ్లేందుకు అనుమతించమని ఆ బోర్డులు స్పష్టం చేస్తున్నాయి. దాంతో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ క్రికెటర్లు బరిలోకి దిగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
అయితే ఐపీఎల్ రెండో దశలో ఆడేందుకు యూఏఈకి రాని విదేశీ ఆటగాళ్ల జీతాల్లో కోత పడనుందని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచులకు మాత్రమే వారికి వేతనాలు చెల్లిస్తారని, బీసీసీఐ ఒప్పంద ఆటగాళ్లకు మాత్రం ఎలాంటి కోత ఉండబోదని చెప్పారు. 'అవును, అది నిజమే. విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ కోసం యూఏఈకి రాకపోతే పారితోషికంలో కోత పెట్టే హక్కులు ఫ్రాంచైజీలకు ఉన్నాయి.
ఇప్పటి వరకు ఆడిన మ్యాచులకే చెల్లిస్తారు' అని సదరు బీసీసీఐ అధికారి తెలిపారు. ఉదాహరణకు కమిన్స్ పూర్తి వేతనం రూ.15.5 కోట్లు. అతను రాకుంటే రూ.7.75 కోట్లే చెల్లిస్తారు. బీసీసీఐ ఒప్పంద క్రికెటర్లకు మాత్రం ఇబ్బంది లేదు. 2011 నుంచి వారికి బీమా వర్తిస్తుండటమే ఇందుకు కారణం.
ఇక ఎవరూ వచ్చినా రాకున్నా ఐపీఎల్ మాత్రం ఆగదని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశాడు. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతోనే లీగ్‌ను పూర్తి చేస్తామని తెలిపాడు. తాము ఏ బోర్డుతో చర్చలు జరపమని పేర్కొన్నాడు. అయితే ఐపీఎల్ వాయిదా అనంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆ దేశ ప్రభుత్వం విధించిన కఠిన ఆంక్షలతో సుమారు 25 రోజుల తర్వాత ఇళ్లకు చేరారు. ఈ క్వారంటైన్ నిబంధనలతో ఓ రకంగా వాళ్లు విసిగిపోయారు. ఇప్పటికే కమిన్స్.. క్రికెట్‌కు బ్రేక్ తీసుకోగా.. ఇంకెంత మంది వస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.