
ఫేవరెట్లుగా మ్యాక్స్‌వెల్, మలన్
ఐపీఎల్ 2021 వేలంలో ఎక్కువగా ఆకర్షిస్తోంది ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలనే. ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్‌వన్ టీ20 ఆటగాడైన మలన్.. ఈ సీజన్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. గతేడాది ఐపీఎల్‌లో పెద్దగా ప్రభావం చూపకపోయిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌పై ఫ్రాంఛైజీలు కన్ను వేశాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని చేజిక్కించుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇరు ఫ్రాంచైజీలు పోటీపడితే మాత్రం అతనిపై కోట్లు కురిసే అవకాశముంది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీకి కూడా వేలంలో చెప్పుకోదగ్గ ధర పలకొచ్చు. మనోడిని కూడా చెన్నై తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

హేల్స్ కోసం పోటీ
బిగ్‌బాష్ లీగ్ గత సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ కోసం ఫ్రాంఛైజీలు పోటీపడే అవకాశముంది. బీబీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన ఆసీస్ పేసర్ జే రిచర్డ్‌సన్.. బ్యాట్, బంతితోనూ రాణించే కివీస్ ఫాస్ట్ బౌలర్ కైల్ జేమీసన్ కూడా ఈ వేలంలో మంచి ధరకు అమ్ముడుపోయి ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను దక్కించుకునేందుకు ఫ్రాంఛైజీల మధ్య పోటీ ఉండొచ్చు. ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్, నిషేధం నుంచి బయటపడ్డ బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకిబ్‌లతో పాటు ముస్తాఫిజుర్ రహ్మాన్, క్రిస్ మోరిస్, జేసన్ రాయ్, మార్నస్ లబుషేన్ కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నారు.

అజహరుద్దీన్ కోటీశ్వరుడయ్యే ఛాన్స్
హర్భజన్ సింగ్, చేటేశ్వర్ పుజారా, హనుమ విహారి, పియూష్ చావ్లా, పవన్ నేగి, ఉమేశ్ యాదవ్, శివమ్ దూబె లాంటి భారత ఆటగాళ్లు తమ అదృష్టం పరీక్షించుకుకోనున్నారు. కేరళ యువ బ్యాట్స్‌మన్ అజహరుద్దీన్ ఇలాగే కోటీశ్వరుడయ్యే అవకాశాలున్నాయి. ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో 37 బంతుల్లోనే శతకం బాది అతను సంచలనం సృష్టించాడు. నాగాలాండ్‌కు చెందిన 16 ఏళ్ల స్పిన్నర్ క్రీవిట్సో కెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌పైనా అందరి దృష్టి ఉండనుంది.

భారత్‌లోనే టోర్నీ
ఆటగాళ్ల కొనుగోలుకు గరిష్ఠంగా ఒక్కో జట్టుకు రూ.85కోట్లను ఖర్చు పెట్టే అవకాశం ఉండగా.. ఈ ఏడాది వేలానికి పంజాబ్ కింగ్స్ వద్ద అధిక నిధులు ఉండగా హైదరాబాద్ వద్ద తక్కువ ఉన్నాయి. మొత్తంగా ఏ విభాగాల్లో జట్టు బలహీనంగా ఉందో అందుకు సరిపోయే ప్లేయర్లను సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో 2020 ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించిన బీసీసీఐ.. ఈ ఏడాది టోర్నీని భారత్‌లోనే బయోబబుల్ మధ్య ఏప్రిల్-జూన్ మధ్య జరుపుతామని వెల్లడించిన సంగతి తెలిసిందే.

వివరాలు
వేలంలో ఆటగాళ్లు: 292 మంది
భారత్ నుంచి: 164
విదేశీ ప్లేయర్లు: 125
అసోసియేట్ దేశాల నుంచి: 3
జట్లలో మొత్తంగా ఖాళీ స్థానాలు: 61
అందులో విదేశీ ఆటగాళ్లకు: 22
అభిమానులకు శుభవార్త.. త్వరలోనే ఐపీఎల్ 2021పై కీలక నిర్ణయం!!


Click it and Unblock the Notifications
