
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 వేలానికి రంగం సిద్దమైంది. దమ్మున్న ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిపించి ఓవర్‌నైట్‌లో వాళ్ల రాత మార్చేందుకు ఎనిమిది ఫ్రాంచైజీలు సిద్దమయ్యాయి. కరోనా కారణంగా గతేడాది యూఏఈకి తరలిన లీగ్.. ఈ సారి భారత్‌కు తిరిగొస్తుండడంతో ఇక్కడి పిచ్‌లపై చెలరేగే క్రికెటర్లను ఎంచుకునేందుకు.. తమ బలాన్ని మరింత పెంచుకునేందుకు.. ఇప్పటికే అన్ని లెక్కలూ వేసుకున్నాయి.
ఎప్పట్లాగే హార్డ్ హిట్టర్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో లోకల్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడం ఖాయమే. ఈ నేపథ్యంలోనే మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఈ వేలంలో తెలుగు రాష్టాల నుంచి కూడా ఆటగాళ్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు.
టీమిండియా ప్లేయర్ హనుమ విహారితో సహా 14 మంది యువ ఆటగాళ్లు రేసులో ఉన్నారు. గత సీజన్‌లో ఎవ్వరూ తీసుకోని విహారి ఒకటిన్నర కోట్ల బేస్‌ప్రైజ్‌తో పోటీలో నిలిచాడు. గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎంపికైనా ఒక్క మ్యాచ్‌లోనూ ఆడని ఆల్‌రౌండర్ బావనక సందీప్‌తో పాటు హైదరాబాద్ నుంచి మిలింద్, యుధ్‌వీర్, అజయ్ దేవ్‌గౌడ్, టి, రవితేజ, తనయ్, తిలక్, భగత్ వర్మ రూ.20 లక్షల బేస్‌ప్రైజ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
వీరంతా ఆల్‌రౌండర్లే. ఇదే బేస్‌ప్రైజ్‌తో ఆంధ్ర నుంచి కీపర్ కేఎస్ భరత్, పేసర్లు సీహెచ్ స్టీఫెన్, పృథ్వీరాజ్, హరిశంకర్ రెడ్డి, ఆల్‌రౌండర్ షోయబ్ కూడా తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. గత కొన్ని సీజన్లుగా తెలుగు రాష్ట్రాల ఆటగాళ్ల ప్రాతినిధ్యం తగ్గిన నేపథ్యంలో ఈసారైన ఎక్కువ మందికి అవకాశం దక్కాలని ఇరు రాష్ట్రాల అభిమానులు కోరుకుంటున్నారు. అంబటి రాయుడు, మహ్మద్ సిరాజ్ మినహా.. ఐపీఎల్‌లో మరో చెప్పుకోదగ్గ ప్లేయర్ లేడు.