
ముంబై: ప్రతి మనిషికి కొన్ని నమ్మకాలు ఉండడం సహజం.. ఏదైనా పని ప్రారంభించే ముందు తమకు ఇష్టమైన పని చేయడమో.. దేవుడిని తలుచుకోవడమో చేస్తుంటారు. క్రికెటర్లు కూడా దీనికి మినహాయింపు కాదు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మైదానంలోకి వచ్చేముందు ప్రతీసారి ఆకాశంలోకి చూస్తూ దండం పెట్టేవాడు. సచిన్ ఒక్కడే కాదు.. చాలా మంది ఆటగాళ్లు తమ ఆటను ప్రారంభించేముందు నమ్మకంగా అనిపించే పని చేసేవారు. అలాంటి సెంటిమెంట్స్ తనకు ఉన్నాయని కోల్‌కతా నైటరైడర్స్ హార్డ్ హిట్టర్, విండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రస్సెల్ తెలిపాడు. ఎడమ కాలుతో మైదానంలోకి అడుగుపెట్టడం, బ్యాటింగ్ ముందు బ్యాట్ తిప్పడం తన నమ్మకమని చెప్పుకొచ్చాడు.
కేకేఆర్ టీమ్‌మేనేజ్‌మెంట్ నైట్‌క్లబ్ సిరీస్ పేరిట ఒక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రసెల్‌తో పాటు శివమ్ మావి అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా వారు నిర్వహించిన ఇంటర్య్వూలో రసెల్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.'ప్రతీ ఆటగాడికి కొన్ని నమ్మకాలు ఉంటాయి. కొందరు వాటిని ఎక్కువ నమ్మితే.. మరికొందరు ఆచరిస్తారు. నేను రెండో కోవకు చెందినవాడిని. మైదానంలో అడుగుపెట్టే ముందు ప్రతీసారి నా ఎడమకాలుతో బౌండరీ రోప్‌ను దాటుతుంటాను. ఆ తర్వాత బౌలర్ వేసే మొదటి బంతిని ఎదుర్కోవడానికి ముందు బ్యాట్‌ను నాలుగు.. అంతకంటే ఎక్కువసార్లు తిప్పుతాను. అలా చేయకపోతే.. నాకు ఆరోజు మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించలేనని నమ్మకం.'అని రస్సెల్ చెప్పుకొచ్చాడు.
ఇక ఐపీఎల్ 2021 సీజన్‌లో బుధవారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో రస్సెల్ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచిన కేకేఆర్‌ను దినేశ్ కార్తిక్ సాయంతో రస్సెల్ చెలరేగాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ మెరుపు హాఫ్ సెంచరీ(22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 54) చేసాడు. దురదృష్టవశాత్తు బంతిని తప్పుగా అంచనా వేసిన అతను సామ్ కరన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతను ఔటైనా కమిన్స్ (34 బంతుల్లో 66 నాటౌట్, 4 ఫోర్లు, 6 సిక్సర్లతో) చెలరేగడంతో కేకేఆర్ విజయం ఖాయమనిపించింది. కానీ చివర్లో టెయిలండర్ల నుంచి సహాకారం లభించడంతో చెన్నై 18 పరుగులతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. మ్యాచ్‌లో కేకేఆర్ ఓడినా.. రస్సెల్, కమిన్స్, దినేశ్ కార్తీక్ ఇన్నింగ్స్‌లు హైలైట్‌గా నిలిచాయి.