
దుబాయ్: టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటాడనే విషయం తెలిసిందే. ప్రతీ విషయంపై తనదైన శైలిలో స్పందిస్తూ నవ్వులు పూయిస్తుంటాడు. సహచర ఆటగాళ్లపై కూడా వ్యంగ్యస్త్రాలు సంధిస్తుంటాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్ కోసం సిద్దమవుతున్న ఈ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్పిన్నర్ .. దుబాయ్‌లో జట్టుతో ప్రాక్టీస్ చేస్తున్నాడు. క్వారంటైన్ పూర్తి చేసుకున్న ఆ జట్టు గురువారమే ప్రాక్టీస్ ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజం, ఆర్సీబీ కీలక బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేశాడు. ఆ ఫొటోలో క్రికెట్ కిట్ పక్కన కూర్చున్న డివిలియర్స్..కరోనా హెల్మ్‌ట్ పెట్టుకొని ఎమ్ఆర్ఎఫ్ బ్యాట్ పట్టుకున్నాడు. పక్కనే గ్లౌజ్, ప్యాడ్స్‌తో పాటు మరో రెండు ఎమ్ఆర్ఎఫ్ బ్యాట్‌లున్నాయి. ఈ ఫొటోకు 'క్వారంటైన్‌లో ఈ రోజు చివరిది. మైదానంలో అడుగుపెట్టేందుకు ఆగలేకపోతున్నా'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.
ఇక ఈ పోస్ట్‌పై చహల్ ఫన్నీగా స్పందించాడు. 'రెండు రోజుల తర్వాత ఆ మూడింటిలో నీవు రెండే బ్యాట్స్ చూస్తావు సర్'అని కామెంట్ చేశాడు. ఆ మూడింటిలో ఒకటి తాను ఎత్తుకపోతానని పరోక్షంగా చెప్పాడు. ప్రస్తుతం ఈ కామెంట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టు ట్రెయినింగ్ క్యాంప్ గురువారం ప్రారంభమైంది. ఆర్‌సీబీ టీమ్ ఆరు రోజుల తప్పనిసరి క్వారంటైన్ బుధవారంతో ముగిసింది. దీంతో జట్టు మొత్తంమూడు వారాల ట్రెయినింగ్ క్యాంప్‌లో పాల్గొననుంది. ఐసీసీ క్రికెట్ అకాడమీలో పూర్తి బయోసెక్యూర్ వాతావరణంలో ఈ క్యాంప్ జరగనుంది.
ఈ క్యాంప్‌కు ఆర్‌సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్స్ మైక్ హెస్సన్, హెడ్‌కోచ్ సైమన్ కటిచ్ నేతృత్వం వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో దుబాయ్‌కు తరలివెళ్లిన ఐపీఎల్.. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు మూడు వేదికల్లో జరగనుంది.