
దుబాయ్: యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ జట్టులోకి వచ్చిన వేళా విశేషమో కానీ ఐపీఎల్ 2020 సీజన్‌లో వరుస ఓటములతో చతికిలపడిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ అనూహ్యంగా పుంజుకుంది. హ్యాట్రిక్ విజయాలతో ప్లే ఆఫ్ రేసులోకి దూసుకొచ్చింది. మంగళవారం టేబుల్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది.
నిన్నటి మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ చెప్పడం మరచిపోయాడు. సాధారణంగా హోమ్ కెప్టెన్ టాస్ నిర్ణయం వెల్లడించాలి. కానీ ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా తీవ్ర ఒత్తిడికి గురైన కేఎల్ రాహుల్.. టాస్ వేశాక తన నిర్ణయాన్ని చెప్పడం మరిచిపోయాడు. ఆపై రెండోసారి టాస్ వేయాల్సి వచ్చింది. ఇందులో టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కేఎల్ రాహుల్ టాస్ చెప్పడం మరిచిపోయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. హోస్ట్ మురళీ కార్తీక్ చెప్పేవరకు రాహుల్‌కు ఈ మ్యాచ్‌లో తాము హోమ్ టీమ్ అనే విషయం తెలియదు. అంతలా అయోమయానికి గురయ్యాడు.
వాస్తవానికి ఐపీఎల్ దుబాయ్‌కి తరలడంతో అభిమానులకు కూడా ఏ మ్యాచ్‌లో ఏ జట్టు హోమ్ టీమ్ అని తెలుసుకోవడం కష్టమైంది. ఇక్కడైతే ఎవరి సొంతమైదానాల్లో వారు మ్యాచ్‌లు ఆడేవారు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' శిఖర్ ధావన్ (61 బంతుల్లో 106 నాటౌట్) ఒక్కడే చెలరేగాడు. వీరోచిత శతకంతో ఆఖరి దాకా స్కోరుబోర్డును నడిపించాడు. తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసి గెలిచింది.
పూరన్ (28 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), గేల్ (23 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. అయితే తుషార్ పాండే తన ఫస్ట్ ఓవర్‌లో భారీగా పరుగులిచ్చుకున్నాడు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ అతని బౌలింగ్‌ను చితక్కొట్టాడు. దాంతో ఆ ఓవర్‌లో 26 పరుగులు వచ్చాయి. ఇక నికోలస్ పూరన్‌ను సింపుల్‌గా రనౌట్ చేయడంలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ విఫలమయ్యాడు. ఇది ఆ జట్టు ఓటమిని శాసించింది.