
మయాంక్ ముగించాడు:
నిర్ణీత ఓవర్లలో పంజాబ్, ముంబై జట్లు సమాన స్కోర్లు చేయగా.. ఫలితం తేలేందుకు నిర్వహించిన సూపర్ ఓవర్ కూడా టై అయింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జస్ప్రీత్ బుమ్రా ధాటికి కేవలం 5 పరుగులే చేయగలిగితే.. ఆ తర్వాత మొహమ్మద్ షమీ ధాటికి ముంబై కూడా సరిగ్గా అవే పరుగులు చేసింది. మరో సూపర్ ఓవర్ నిర్వహించగా.. ఈ సారి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై కీరన్ పొలార్డ్ ధాటిగా ఆడటంతో 11 పరుగులు చేసింది. పంజాబ్ యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, మయాంక్‌ను బరిలో దించగా.. వీరిద్దరూ విజృంభించి నాలుగు బంతుల్లోనే మ్యాచ్‌ను ముగించారు.

ఆ ప్రశ్నకు హర్టయ్యా:
అయితే రెండో సూపర్ ఓవర్ ముందు బ్యాటింగ్‌కు వచ్చే సమయంలో క్రిస్ గేల్ కోపం, అసంతృప్తితో కనిపించాడు. ఆ సమయంలో కోపంగా ఉండటానికి గల కారణాన్ని గేల్ వెల్లడించాడు. 'రెండో సూపర్ ఓవర్ ముందు నేను, మయాంక్ మాట్లాడుకున్నాం. తొలి బంతిని మనిద్దరిలో ఎవరం ఎదుర్కొందాం? అని మయాంక్ నన్ను అడిగాడు. ఆ ప్రశ్నకు నేను హర్టయ్యా' అని గేల్ తెలిపాడు. 'మయాంక్ నువ్వు నిజంగానే ఆ ప్రశ్న అడుగుతున్నావా?.. ఫస్ట్ బాల్‌ను బాస్ ఎదుర్కొంటాడు' అని తాను సమాధానమిచ్చాడని గేల్ చెప్పుకొచ్చాడు. అలా అనడమే కాదు తొలి బంతికే బాస్ సిక్స్ కూడాబాదాడు.

నా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ షమీనే:
అనంతరం యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మాట్లాడుతూ... 'సూపర్ ఓవర్‌లో నేను బ్యాటింగ్‌కు వెళ్లే సమయంలో ఎలాంటి ఒత్తిడి లేదు. కాకపోతే కొంచెం కోపం వచ్చింది. సులభంగా గెలవాల్సిన మా జట్టును ఆ పరిస్థితిలో చూసి ఆందోళన చెందాను. కానీ ఇది క్రికెట్. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. తొలి సూపర్ ఓవర్‌లో ఆరు పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడం కష్టమైన పని. పైగా క్రీజులో ఉన్నది రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్. మొహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో నా హీరో షమీ. అతనికే నా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. నేను నెట్స్‌లో షమీని ఎదుర్కొన్నాను. అతను అద్భుతమైన యార్కర్లు వేస్తాడు. మ్యాచ్‌లోనూ అదే చేశాడు. మా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు' అని గేల్ అన్నాడు.

మ్యాచ్ టై:
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. డికాక్ (43 బంతుల్లో 53; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ శతకం చేయగా.. పొలార్డ్ (12 బంతుల్లో 34 నాటౌట్; ఒక ఫోర్, 4 సిక్సర్లు), కూల్టర్‌నీల్ (12 బంతుల్లో 24 నాటౌట్; 4 ఫోర్లు) మెరుపులు మెరిపించారు. పంజాబ్ బౌలర్లలో షమీ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సరిగ్గా 176 పరుగులే చేసింది. కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 77; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ముంబై బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు పడగొట్టాడు.
CSK vs RR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీ.. ఉనద్కత్‌పై వేటు!!


Click it and Unblock the Notifications












