
న్యూఢిల్లీ: చెన్నైసూపర్ కింగ్స్ టీమ్‌పై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైనశైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 'వీరు కీ బైతక్'షో పేరిట ఐపీఎల్ 2020 మ్యాచ్‌లకు ముందు ఆయా జట్లపై సెహ్వాగ్ సెటైర్లు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సీజన్‌లో వరుస విజయాలతో దూకుడు మీదున్న ముంబై ఇండియన్స్‌ను సీనియర్ సిటీజన్స్‌తో నిండిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ ఓడించడం కష్టమని ఎగతాళి చేశాడు.
శుక్రవారం ఈ రెండు జట్లు షార్జా వేదికగా రెండోసారి తలపడుతున్న విషయం తెలిసిందే. సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో ముంబైకి చెన్నై గట్టిషాకిచ్చినా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ జట్టును ఓడించడం కష్టమే అనిపిస్తుంది. ఈ విషయాన్నే వీరూ ప్రస్తావించాడు. 'ఐపీఎల్‌లో మరో ఆసక్తికరపోరుకు రంగం సిద్దమైంది. ఇప్పటికే ముంబైని చెన్నై ఓడించింది. కానీ ఆ తర్వాత ముంబై వరుస విజయాలతో దూసుకెళ్తే.. చెన్నై మాత్రం వరుస పరాజాయాలతో చతికిలపడింది. పైగా ఆ జట్టు సీనియర్ సిటిజన్స్ క్లబ్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో ముంబైని ఓడించడం చెన్నైకి కష్టమే.'సెహ్వాగ్ ధోనీసేనపై సెటైర్లు పేల్చాడు.
ప్లే ఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవడమే లక్ష్యంగా ముంబై ఇండియన్స్ భావిస్తుండగా.. వరుస పరాజయాలకు తోడు కీలక ప్లేయర్ల సేవలను కోల్పోయి నిరాశలో ఉన్న సీఎస్‌కే మాత్రం ముంబైకి మరోసారి షాకివ్వాలని చూస్తోంది. ఇప్పటిదాకా పది మ్యాచ్ లాడి ఆరు పాయింట్లు సాధించిన చెన్నై.. మిగిలిన నాలుగింటిలో గెలిచినా ప్లే ఆఫ్ బెర్త్ దక్కే సూచనల్లేవు. కానీ ఇప్పటికే తమకు ఎన్నో చేదు జ్ఞాపకాలు మిగిల్చిన ఈ సీజన్ ను అదిరిపోయే ఫినిషింగ్ టచ్ తో ముగించాలని భావిస్తోంది. మరోవైపు సీజన్ ప్రారంభమ్యాచ్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు టేబుల్ టాపర్‌గా నిలవాలని ముంబై పట్టుదలతో ఉంది. మరి ఏ జట్టును విజయం వరిస్తుందో చూడాలి.