అందుకే ఆర్‌సీబీని వీడలేదు.. వీడను కూడా: విరాట్ కోహ్లీ

దుబాయ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. 2008 అండర్ 19 ప్రపంచకప్ విజయంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లోకి తారజువ్వలా దూసుకొచ్చాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్ తొలి సీజన్‌లో రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో ఆడాడు. ప్రారంభంలో అంతగా ప్రభావం చూపకపోయినా.. అవకాశాలు రాకపోయినా కోహ్లీ నిరీక్షించాడు. ఆ ఓపికే విరాట్‌ను ఈ ధనా ధన్ లీగ్‌లో స్టార్ ఆటగాడిగా.. సక్సెస్ ఫుల్ బ్యాట్స్‌మన్‌గా నిలబెట్టింది.
ఇక 2011లోఆర్‌సీబీ సారథ్య బాధ్యతలు అందుకున్న కోహ్లీ.. 2015లో ఆ జట్టును ప్లేఆఫ్‌కు చేర్చాడు. 2016లో తన అద్వితీయమైన ఆటతో ఫైనల్‌కు తీసుకెళ్లాడు. కానీ ఆ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చేతిలో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. అనంతరం జరిగిన మూడు సీజన్లలో ఆ జట్టు ఘోరంగా విఫలమైంది. కనీసం స్థాయికి తగ్గ ప్రదర్శన కూడా కనిపించలేదు.

అదే క్రేజ్.. అదే ఫాలోయింగ్..
అయినా ఆ జట్టు ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. కారణం విరాట్ కోహ్లీనే. ఇప్పటికీ ఆ జట్టు టైటిల్ ఫేవరేటే. ఇన్నేళ్ల పాటు ఆర్‌సీబీకే ఆడిన కోహ్లీ.. ఎట్టి పరిస్థితుల్లో ఆ జట్టును వీడనని స్పష్టం చేశాడు. కనీసం ఆర్సీబీ ఫ్రాంచైజీని వదిలేయాలని ఆలోచన కూడా ఏనాడు రాలేదన్నాడు. దానికి ఆర్‌సీబీ యాజమాన్యం చూపెట్టే ప్రేమే కారణమన్నాడు. అప్‌కమింగ్ ఐపీఎల్ 2020 సీజన్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని తెలిపిన కోహ్లీ.. ఆర్‌సీబీ జట్టుతో ఉన్న విడదీయని బంధం గురించి అభిమానులతో పంచుకున్నాడు. టైటిల్ నెగ్గడమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు.

అంతిమ లక్ష్యం అదే..
‘ఆర్‌సీబీతో నా బంధానికి 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఇదో అద్భుతమైన ప్రయాణం. మా టైటిల్ నిరీక్షణకు తెరదించుతూ.. ఆర్‌సీబీ అంతిమ లక్ష్యాన్ని అందుకోవాలనుకుంటున్నాం. గతంలో మూడు సార్లు దగ్గరగా వచ్చి టైటిల్‌ను తృటిలో చేజార్చుకున్నాం. టైటిల్ గెలవడం అనేది ఎప్పుడూ మా కలనే. ఇక ఆర్‌సీబీ అంటే ఇష్టం. జట్టును వీడాలనే ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే ఆ ఫ్రాంచైజీ చూపించే ప్రేమ, కేరింగ్ అలాంటింది.

జట్టును వదలను..
ఈ సీజన్ బాగా ఆడుతామా లేదా అనే ఆందోళన అందరికి ఉంటుంది. కానీ బెంగళూరు జట్టు పట్ల విధేయత చూపాలి. ఆర్‌సీబీ అద్భుతమైన జట్టు. నేను ఐపీఎల్‌ను వీడేంత వరకు.. మా ప్రదర్శన ఎలా ఉన్నా.. జట్టును మాత్రం వదిలిపెట్టను.'అని కోహ్లీ స్పష్టం చేశాడు. ఇక గత 12 సీజన్లలో ఆర్‌సీబీ ఒక్కసారి కూడా టైటిల్ అందుకోలేకపోయింది. 2009, 2016 సీజన్లలో ఫైనల్‌కు చేరిన ఆ జట్టు రెండు హైదరాబాద్ జట్లు(సన్ రైజర్స్, డెక్కన్ చార్జెస్) చేతిలోనే ఓడింది. 2015లో ప్లేఆఫ్‌లో వెనుదిరిగింది.

ఐదు నెలల తర్వాత..
‘దాదాపు ఐదు నెలల క్రితం నెట్ ప్రాక్టీస్ చేశాను. సౌతాఫ్రికాతో ధర్మశాల వేదికగా జరిగే మ్యాచ్ కోసం చివరిసారి ప్రాక్టీస్ చేశాను. కానీ వర్షం కారణంగా ఆ మ్యాచ్ ఆడలేదు.ఇక లక్నోలో జరగాల్సిన వన్డే నాటికి పరిస్థితి మారిపోయింది. కానీ పరిస్థితులు అలా వచ్చినందుకు నేనేమీ ఫీల్ కాలేదు. సుదీర్ఘం విరామం తర్వాత ప్రాక్టీస్ చేయడంతో కాస్త ఇబ్బందులు ఉంటాయి. ఈ సీజన్ ఐపీఎల్ కోసం సిద్ధంగా ఉన్నాం' అని కోహ్లీ తెలిపాడు. గత 10 సీజన్లుగా జట్టును నడిపిస్తున్న కోహ్లీ.. జట్టుకు టైటిల్ అందించకపోయినా.. ఆర్‌సీబీ అతని కెప్టెన్సీపై వేటు వేయలేదు. ఇదే కోహ్లీని కట్టిపడేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications