నీలానే గంగూలీ అనుకుంటే ఎక్కడ ఉండేవాడివి? ధోనీ స్పార్క్ కామెంట్స్‌పై దుమారం!

దుబాయ్: ఐపీఎల్ 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల పరంపర కొనసాగుతుంది. రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్లతో చిత్తుగా ఓడిన చెన్నై దాదాపు ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఫామ్‌లో లేని రాజస్థాన్ చేతిలో చెన్నై ఓడిపోవడం క్రికెట్ వర్గాలను విస్మయపరిచింది. అయితే ధోనీ నిర్ణయాలే జట్టు ఓటమికి కారణమని, ఫామ్‌లో లేని సీనియర్ ఆటగాళ్లకు పదే పదే అవకాశాలిచ్చి మూల్యం చెల్లించుకున్నాడని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు విమర్శలు గుప్పించారు. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకపోవడంపై కూడా మ్యాచ్ జరుగుతుండగానే మండిపడ్డారు.

ధోనీ నీకు అవకాశం దక్కేదా?
మ్యాచ్ అనంతరం ఇదే విషయాన్ని ధోనీ ముందు ప్రస్తావించగా.. తమ యువ ఆటగాళ్లలో స్పార్క్ కనిపించలేదని తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నాడు. ‘యువ ఆటగాళ్లను ఆడించడం లేదనే విమర్శ లో వాస్తవం ఉంది. అయితే మేం ఆశించినంత ప్రత్యేకత మా కుర్రాళ్లలో లేకపోవడం కూడా కారణం కావచ్చు. మున్ముందు వారికి అవకాశం ఇస్తే ఒత్తిడి లేకుండా ఆడతారేమో చూడాలి.'అని ధోనీ చెప్పుకొచ్చాడు. అయితే ఈ వ్యాఖ్యలపై క్రికెట్ వర్గాలు భగ్గుమన్నాయి. ధోనీ కెరీర్ ప్రారంభంలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇలానే ఆలోచిస్తే తనకు అవకాశం దక్కేదా? ఈ స్థాయికి వచ్చేవాడా? అని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

జాదవ్‌లో స్పార్క్ ఉందా?
ఇక యువ ఆటగాళ్లలో ఆ స్పార్క్ కనిపించలేదన్న వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డారు. జట్టుకు కుదిబండగా మారిన కేదార్ జాదవ్‌లో ఆ స్పార్క్ ఉందా? అని ప్రశ్నించారు. స్టార్ స్పోర్ట్స్ తమిళ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. ‘ధోనీ గొప్ప క్రికెటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. యువ ఆటగాళ్ల పట్ల అతను చేసిన వ్యాఖ్యలే విస్మయపరుస్తున్నాయి. జట్టు ఎంపిక ప్రక్రియ ఏ మాత్రం బాలేదు. అత్యంత కీలకమైన మ్యాచ్‌లో కేదార్ జాదవ్‌ను ఎందుకు ఆడించారు. యంగ్ క్రికెటర్ ఎన్ జగదీశన్‌కు ఎందుకు అవకాశాలు ఇవ్వలేదు. జగదీషన్‌లో ఆడే సత్తా ఉంది.'అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఒక్క యువ ఆటగాడు రాలేదు..
ఇక ధోనీ ఎప్పుడూ ఇంతే.. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడని, తన 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒక్క అనామక ఆటగాడు కూడా సరైన అవకాశాలు దక్కించుకోలేదని అభిమానులు మండిపడుతున్నారు. ఎంతసేపు సీనియర్ ఆటగాళ్లనే వెనకేసుకొస్తాడని, వారు విఫలమైనా పదే పదే అవకాశాలు ఇస్తాడని విమర్శిస్తున్నారు. అలాంటి ధోనీ యువ ఆటగాళ్లపై కూడా అలాంటి నమ్మకాన్ని ఉంచవచ్చు కదా? అని చురకలంటిస్తున్నారు. జగదీషన్ అరంగేట్ర మ్యాచ్‌లోనే 33 రన్స్ చేశాడని, సహచర బ్యాట్స్‌మన్ వల్ల రనౌటయ్యాడని,అతని స్థానంలో జడేజాను ఎందుకు ఆడించారని నిలదీస్తున్నారు. అలాగే ధోనీ టిప్స్ ఇవ్వడానికే పరిమితమయ్యాడని, ఒక్క అవకాశం కూడా యువ ఆటగాళ్లకు ఇవ్వలేదని మండిపడుతున్నారు.

పాపం బాబా అపరజిత్.. ఐదేళ్లు బెంచ్‌కే
తమిళనాడు యువ ఆల్‌రౌండర్ బాబా అపరిజిత్ అయితే ధోనీ కారణంగా ఐదేళ్లు బెంచ్‌కే పరిమితమయ్యాడు. చివరకు ఐపీఎల్‌లో ఆడాలనే కల నెరవేరకుండానే కనుమరుగయ్యాడు. 2012 అండర్-19 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన బాబాను సీఎస్‌కే 2013 ఐపీఎల్ వేలం కొనగోలు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీపై నిషేధం విధించేవరకు అతనికి ఒక్క అవకాశం దక్కలేదు. మూడేళ్లపాటు బాబా బెంచ్‌కే పరిమితమయ్యాడు. అనంతరం 2016, 2017లో రైజింగ్ పుణె తరఫున అవకాశం దక్కించుకున్న బాబా.. మళ్లీ రెండేళ్ల పాటు అవకాశాలను అందుకోలేదు. అనంతరం ఏ ఫ్రాంచైజీ అతన్ని కనుకరించకపోవడంతో ఐపీఎల్ మ్యాచ్ ఆడాలనే కల నెరవేరకుండానే కనుమరుగయ్యాడు. తమిళనాడు తరఫున డొమెస్టిక్ క్రికెటే ఆడుతున్నాడు. ఇప్పటి వరకు చాలా మంది చెన్నై ఆటగాళ్లు ధోనీ సారథ్యంలో అవకాశాలను అందుకోలేకపోయారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications