
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ నిర్వహణ విషయంలో దూకుడు మీదున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి గట్టి షాక్ తగిలింది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి చైనా మొబైల్ కంపెనీ వివో తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా చైనాపై భారత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ వ్యతిరేకత నేపథ్యంలో ఈ సీజన్ టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకోవడమే ఉత్తమమని వివో ఇండియా భావించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. కనీసం ఈ ఏడాదైన తమ ఒప్పందానికి బ్రేక్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చిందని తెలిపింది. ఇక ఈ విషయాన్ని సోమవారం సాయంత్రమే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఫ్రాంచైజీలకు తెలియజేసిందని పేర్కొంది.
అయితే వివో నిర్ణయం బీసీసీఐకి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో వివో స్థాయి కంపెనీని స్పాన్సర్‌గా తీసుకురావడం బీసీసీఐకి పెద్ద సవాలే. వివో ఇచ్చే దాంట్లో సగం సాధించినా గొప్ప విషయమేనని వ్యాపార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న వివో బీసీసీఐకి ఏడాదికి రూ.440 కోట్లు చెల్లిస్తోంది.
కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ 2020 సీజన్‌ను దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గత ఆదివారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి లీగ్ నిర్వహణపై ఓ నిర్ణయానికి వచ్చింది. టైటిల్ స్పాన్సర్‌గా వివోనే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఇంత తక్కువ సమయంలో మరో కొత్త స్పాన్సర్ లభ్యం కావడం ఇంచుమించు అసాధ్యమని బోర్డు అభిప్రాయపడింది. దీంతోనే వివోను స్పాన్సర్ కొనసాగించడం అనివార్యమైందని పేర్కొంది.
అయితే గత జూన్‌లో తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో చైనాతో ఘర్షణలు, జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో దేశవ్యాప్తంగా డ్రాగన్ కంట్రీపై ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. చైనా వస్తువులను బహిష్కరించాలనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ప్రజలు కూడా జవాన్లకు మద్దుతుగా ఆ దేశ వస్తువులను స్వచ్చందంగా బహిష్కరించారు. ఇక భారత ప్రభుత్వం కూడా చైనాకు చెందిన పలు యాప్‌లను నిషేధించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఐపీఎల్‌కు వివో స్పాన్సర్‌షిప్ కొనసాగించడంపై యావత్ భారతం భగ్గుమంది. రాజకీయంగా కూడా ఈ నిర్ణయంపై తీవ్ర దుమారం రేగింది. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఇక నెటిజన్లు కూడా సోషల్ మీడియా వేదికగా #BoycottIPL #ChinesePremierLeague యాష్ ట్యాగ్స్‌ను ట్రెండ్ చేశారు.