
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(2020) సీజన్‌కు ఇంకా నాలుగు వారాల సమయం ఉన్నా.. ఆ లీగ్ సందడి అప్పుడే మొదలైంది. కరోనా క్వారంటైన్ నేపథ్యంలో ఇప్పటికే అన్ని జట్లు దుబాయ్‌లో అడుగుపెట్టగా.. ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ పయనమైంది. ఈ సందర్భంగా ఆ ఫ్రాంచైజీ చేసిన ట్వీట్ నవ్వులు పూయిస్తుంది. అచ్చ తెలుగులో సరదాగా చేసిన క్యాప్షన్ అభిమానులను ఆకట్టుకుంటుంది.
విమానాశ్రయంలోని ఆటగాళ్ల ఫొటోలను షేర్ చేసిన సన్ రైజర్స్..'మాది సన్ రైజర్స్ టీమ్ ఈ రోజు దుబాయ్ పోతుంది. మాకు మీరు సపోర్ట్ చేయండి'అని క్యాప్షన్‌గా పేర్కొంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు, సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ అంతా ఒకే చార్టెడ్ ఫ్లైట్‌లో దుబాయ్‌కు బయలుదేరింది. భువనేశ్వర్ కుమార్, మనీష్ పాండే, వృద్ధిమాన్ సాహా ఆరెంజ్ మాస్క్‌లతో ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇక కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లు గురువారమే యూఏఈ చేరుకోగా.. శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ బయలుదేరింది.
కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్ 2020 సీజన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 14 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. ఈ టోర్నీకి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. కరోనా నేపథ్యంలో కఠిన నిబంధనలతో కూడా ఎస్‌ఓపీని జారీ చేసింది. ప్రొటోకాల్స్‌ను అందరూ పాటించాలని, ఎక్కడపడితే అక్కడ తిరగడానికి వీల్లేదని స్పష్టం చేసింది.