
దుబాయ్: ఫీల్డింగ్ వైఫల్యం, బ్యాటింగ్‌లో 10 రన్స్ తక్కువ చేయడం, పవర్‌ప్లేలో భారీగా పరుగులిచ్చుకోవడంతోనే కింగ్స్ పంజాబ్ చేతిలో ఓటమి చవిచూశామని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. పంజాబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టేబుల్ టాపర్ అయిన ఢిల్లీ 5 వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్ తమ ఓటమికి గల కారణాలను తెలియజేశాడు. అయితే ఇవన్నీ తమ మంచికేనని, తప్పిదాలను పునరావృతం కాకుండా సిద్దమవుతామన్నాడు.
'మేం 10 పరుగులు తక్కువగా చేశాం. ఈ ఓటమితో మేం చేసిన తప్పిదాలు తెలిసాయి. అలాగే అనేక సానుకూలంశాలు ఉన్నాయి. శిఖర్ బాయ్ బ్యాటింగ్ అద్భుతం. అది మాకు పాజిటివ్. తుషార్ చాలా పరుగులిచ్చాడు. అతను ఖచ్చితంగా తిరిగి గాడిన పడుతాడు. పిచ్‌ను శిఖర్ అద్భుతంగా అర్ధం చేసుకున్నాడు. పరిస్థితులను ఆకలింపు చేసుకోని చెలరేగాడు. క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాట్స్‌మెన్ వికెట్ పరిస్థితి తెలియజేశాడు. నెమ్మదిగా ఉందని గైడ్ చేశాడు. ఇతరుల కంటే అతను పరిస్థితులను త్వరగా అందిపుచ్చుకున్నాడు. ఫీల్డింగ్‌లో కూడా మేం విఫలమయ్యాం. దాంతో తదుపరి మ్యాచ్‌కు మేం మరింత సిద్దం కావాల్సిన అవసరం ఉందని స్పష్టమైంది. ముందు ముందు ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకుంటాం.'అని అయ్యర్ చెప్పుకొచ్చాడు.
టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' శిఖర్ ధావన్ (61 బంతుల్లో 106 నాటౌట్) ఒక్కడే చెలరేగాడు. వీరోచిత శతకంతో ఆఖరి దాకా స్కోరుబోర్డును నడిపించాడు. తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసి గెలిచింది. పూరన్ (28 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), గేల్ (23 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. అయితే తుషార్ పాండే తన ఫస్ట్ ఓవర్‌లో భారీగా పరుగులిచ్చుకున్నాడు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ అతని బౌలింగ్‌ను చితక్కొట్టాడు. దాంతో ఆ ఓవర్‌లో 26 పరుగులు వచ్చాయి. ఇక నికోలస్ పూరన్‌ను సింపుల్‌గా రనౌట్ చేయడంలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ విఫలమయ్యాడు. ఇది ఆ జట్టు ఓటమిని శాసించింది.