DC vs CSK: సెంచరీతో గర్జించిన గబ్బర్.. ఢిల్లీ అద్భుత విజయం!

షార్జా: ఐపీఎల్ 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురేలేకుండా పోయింది. ఒకరుకు మించి మరొకరు చెలరేగుతుండటంతో ఆ జట్టు జైత్రయాత్ర కొనసాగుతుంది. శిఖర్ ధావన్(58 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో 101 నాటౌట్) అజేయ సెంచరీతో శనివారం జరిగిన ఉత్కంఠపోరులో ఢిల్లీ 5 వికెట్లతో చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 రన్స్ చేసింది. ఫాఫ్ డుప్లెసిస్(47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58), అంబటి రాయుడు(25 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 45 నాటౌట్) రాణించారు.
అనంతరం ఢిల్లీ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసి సునాయస విజయాన్నుందకుంది. చివర్లో అక్షర్ పటేల్(5 బంతుల్లో 3 సిక్స్‌లతో 21 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. చెన్నై బౌలర్లలో చహర్ రెండు వికెట్లు తీయగా.. సామ్ కరన్, ఠాకుర్, బ్రావో చెరొక వికెట్ తీశారు. ఈ గెలుపుతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. 7 విజయాలతో ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నారు.

పృథ్వీ షా సిల్వర్ డక్
ఇక 180 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. గత మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన ఆ జట్టు ఓపెనర్ పృథ్వీషా.. ఈ మ్యాచ్‌లో సిల్వర్ డకౌటయ్యాడు. రాహుల్ చాహర్ వేసిన ఫస్ట్ ఓవర్ సెకండ్ బాల్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానే(8) కూడా తన వైఫల్యాన్ని కొనసాగిస్తూ నిరాశపరిచాడు. చాహర్ బౌలింగ్‌లోనే సామ్ కరన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
దాంతో ఢిల్లీ పవర్ ప్లే ముగిసే సరికి రెండు వికెట్లు నష్టపోయి 41 పరుగులు మాత్రమే చేసింది. ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో ధావన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ చెలరేగాడు. మరోవైపు అయ్యర్ యాంకర్ రోల్ పోషించాడు. ఈ క్రమంలో బ్రావో వేసిన 10వ ఓవర్ రెండో బంతికి క్విక్ సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ధావన్‌కు లైఫ్..
అయితే ఈ ఓవర్‌లో ధావన్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ ధోనీ చేజార్చాడు. దాంతో ఈ అవకాశం అందుకున్న గబ్బర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అయితే బ్రావో బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన అయ్యర్(23) కవర్స్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక క్రీజులోకి వచ్చిన స్టోయినిస్ కూడా ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు.
కరన్ శర్మ బౌలింగ్‌లో వరుస బంతుల్లో 6,4తో దూకుడు కనబర్చాడు. అయితే శార్దుల్ ఠాకుర్ వేసి 16వ ఓవర్‌లో భారీ సిక్సర్ కొట్టిన స్టోయినిస్ ఆ మరుసటి బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించి రాయుడికి చిక్కాడు. ఓవైపు వికెట్లు కోల్పోతున్నా ధావన్ మాత్రం తన దూకుడును తగ్గించలేదు. కరన్ వేసిన 17వ ఓవర్‌లో 6,4 కొట్టిన గబ్బర్.. ఆ మరుసటి ఓవర్ ఆఖరి బంతికి ఫోర్ కొట్టాడు.

ధావన్ సూపర్ సెంచరీ..
దాంతో ఢిల్లీ విజయానికి 12 బంతుల్లో 21 పరుగులు అవసరమయ్యాయి. అయితే కరన్ వేసిన 19వ ఓవర్ తొలి బంతికి అలెక్స్ క్యారీ(4) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ ఓవర్‌లో కరన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 4 పరుగులు మాత్రమే వచ్చాయి. ఆఖరి బంతికి సింగిల్ తీసిన ధావన్ ఐపీఎల్, టీ20 కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. ఇక బ్రావో గాయంతో మైదానం వీడటంతో ఆఖరి ఓవర్‌ను ధోనీ జడేజాకు ఇచ్చాడు. ఈ ఓవర్‌లో అక్షర్ పటేల్ బ్యాక్ టు బ్యాక్ సిక్స్‌లతో మరో విన్నింగ్ షాట్ కొట్టడంతో ఢిల్లీ విజయం లాంఛనమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications