
న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కరోనా కొరల్లో చిక్కుకోవడంతో ఫస్ట్ మ్యాచ్‌పై ఎన్నో సందేహాలు.. మరెన్నో ఊహాగానాలు వినిపించాయి. కానీ విటన్నిటీకి తెరదించుతూ ముందుగా అనుకున్నట్లే డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అబుదాబి వేదికగా సెప్టెంబర్ 19న తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆదివారం షెడ్యూల్‌ను విడుదల చేసింది.
కరోనా నేపథ్యంలో యూఏఈకి తరలిన ఈ డ్రీమ్ 11 ఐపీఎల్ ఎన్నో ఆటంకాలను అధిగమించి ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది. సెప్టెంబర్ 20న ఢిల్లీ వర్సెస్ పంజాబ్ మధ్య రెండో మ్యాచ్ జరుగనుండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 21న దుబాయ్ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది. 22న రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్, 23న కోల్‌కతా, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌లు జరుగనున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 3 వరకు ఐపీఎల్ 13 వ సీజన్ లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 10 డబుల్ హెడర్స్ జరగనుండగా.. దుబాయ్‌లో 24, అబుదాబిలో 20, షార్జాలో 12 మ్యాచ్‌లు జరగనున్నాయి.
భారత కాలమానం ప్రకారం సాయంత్రం మ్యాచ్‌లు రాత్రి 7.30కు ప్రారంభం కానుండగా.. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3.30 గంటలకు మొదలవుతాయి. వ్యూయర్ షిప్ పెంచాలనే లక్ష్యంతో ఈ సారి అరగంట ముందుగానే మ్యాచ్‌లు ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్‌నే విడుదల చేసిన బోర్డు.. ప్లే ఆఫ్స్ షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామని తెలిపింది.

