MI vs RR: ముంబై జోరుకు రాజస్థాన్ బ్రేక్ వేసెనా? ఈ మ్యాచ్‌కు రోహిత్ దూరం!

అబుదాబి: ఐపీఎల్ 2020లో మరో నామమాత్రపు పోరుకు రంగం సిద్దమైంది. హైదరాబాద్ చేతిలో ఓడి ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ ఆదివారం రాత్రి పటిష్ట ముంబై ఇండియన్స్‌తో తలపడుతుంది. ప్లే ఆఫ్ ఆశలు సన్నగిల్లినా గౌరవంగానైనా టోర్నీ నుంచి తప్పుకోవాలని స్మిత్ సేన భావిస్తోంది. మరోవైపు ఆల్‌రౌండ్ షోతో టేబుల్ టాపర్‌గా ఉన్న ముంబై ఈ మ్యాచ్ గెలిచి తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ సీజన్ ఫస్టాఫ్‌లో ముంబై చేతిలో చిత్తుగా ఓడిన రాజస్థాన్.. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది.
ఇక తొడకండరాల గాయం కారణంగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌కు దూరమైన రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగే అవకాశాలు లేవు. గాయం తీవ్రత, టీమిండియా అప్‌కమింగ్ ఆస్ట్రేలియా టూర్ దృష్ట్యా బీసీసీఐ సూచనల మేరకు అతని గాయాన్ని మరికొన్ని రోజులు పరీక్షించనున్నారు. దాంతో గత మ్యాచ్‌లో ముంబైని నడిపించిన కీరన్ పొలార్డ్ సారథ్యంలో ముంబై బరిలోకి దిగనుంది. అయితే ముంబై జోరు కొనసాగుతుందా? లేక రాజస్థాన్ ప్రతీకారం తీర్చుకుంటుందో చూడాలి.

నిలకడలేమి ఆటతో..
ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని శాసించే ఆటగాళ్లున్న రాజస్థాన్ నిలకడలేమి ఆటతో మూల్యం చెల్లించుకుంది. ముఖ్యంగా తొలి రెండు మ్యాచ్‌ల్లో అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టిన సంజూ శాంసన్.. తరువాతి మ్యాచ్‌ల్లో తేలిపోయాడు. ఊతప్ప కూడా రాణించాల్సి ఉంది. జోస్ బట్లర్ రాణిస్తున్నా స్మిత్, స్టోక్స్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్నారు. బౌలింగ్‌లో కూడా స్టోక్స్ తేలిపోతున్నాడు. జోఫ్రా ఆర్చర్, కార్తీక్ త్యాగి అదరగొడుతున్నా మిగతా బౌలర్లు నిలకడ చూపలేకపోతున్నారు. రాహుల్ తెవాటియా పర్వాలేదనిపిస్తున్నాడు. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తేనే ముంబై ముందు రాజస్థాన్ నిలబడగలదు.

పటిష్టంగా ముంబై..
ఆల్‌రౌండ్‌షోతో అదరగొడుతున్న ముంబై.. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పటిష్టంగా ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ దూరమైనా ఆ జట్టుపై ఎలాంటి ప్రభావం చూపలేదు. చెన్నై సూపర్ కింగ్స్‌తో 10 వికెట్లతో గెలిచిన ఆ జట్టు ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది. డికాక్, ఇషాన్, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీలతో టాపార్డర్ పటిష్టంగా ఉంది. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కీరన్ పొలార్డ్‌తో మిడిలార్డర్‌కు డోకా లేదు. బౌలింగ్‌లోనైతే ఆ జట్టుకు తిరుగేలేదు. బుమ్రా, బౌల్ట్ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నారు. వీరంతా చెలరేగితే రాజస్థాన్‌కు కష్టాలు తప్పవు.

ముఖా ముఖి..
ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 23 సార్లు తలపడగా 12-11తో ముంబై లీడ్‌లో ఉంది. ఒక్క మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. తొలి అంచె మ్యాచ్‌లో ముంబై 57 పరుగులతో రాజస్థాన్‌ను చిత్తు చేసింది. అయితే 2018,19 సీజన్లలో రెండూ మ్యూచ్‌ల్లోనూ రాజస్థానే గెలుపొందింది.

పిచ్ రిపోర్ట్
అబుదాబి పిచ్ గత కొన్ని మ్యాచ్‌లుగా చేజింగ్‌కు అనుకూలిస్తోంది. ఇక్కడ ఇప్పటి వరకు మొత్తం 15 మ్యాచ్‌లు జరగ్గా 7 మ్యాచ్‌లు చేజింగ్ టీమ్సే గెలిచాయి. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ తీసుకోవచ్చు. ఈ మైదానంలో ముంబై ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడి 5 గెలిచింది. ఈ మైదానంలో మూడు మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ ఒకటే గెలిచింది. ఇందులో ఒకటి ముంబై చేతిలోనే ఓడింది. రెండో అంచె మ్యాచ్‌ల్లో పిచ్‌లన్నీ అనూహ్యంగా బ్యాటింగ్‌కు ప్రతికూలమయ్యాయి. స్వింగ్, స్పిన్‌కు అనుకూలిస్తున్నాయి. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్ చానెల్స్, డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

తుది జట్లు(అంచనా):
రాజస్థాన్ రాయల్స్: రాబిన్ ఊతప్ప, జోస్ బట్లర్(కీపర్), స్టీవ్ స్మిత్(కెప్టెన్), సంజూ శాంసన్, బెన్ స్టోక్స్, రాహుల్ తెవాటియా, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, అంకిత్ రాజ్‌పుత్, కార్తీక్ త్యాగి
ముంబై ఇండియన్స్: క్వింటన్ డికాక్(కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్(కెప్టెన్), కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్ నీల్, ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications