
షార్జా: ఐపీఎల్ 2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయంతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. మంగళవారం ఏకపక్షంగా సాగిన కీలక మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన ఆరెంజ్ ఆర్మీ 10 వికెట్ల తేడాతో పటిష్ట ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. వరుసగా మూడో విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. అయితే ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇది తమకు ఓ చెత్త ప్రదర్శనని, ఏ మాత్రం గుర్తుంచుకోదగిన రోజు కాదని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.
గాయం నుంచి పూర్తిగా కోలుకోని బరిలోకి దిగిన హిట్ మ్యాన్ మ్యాచ్ అనంతరం తమ ఓటమిగల కారణాలను వెల్లడించాడు. తాము చేసిన ప్రయోగాలు విఫలమయ్యాయని, త్వరగా వికెట్లు కోల్పోవడంతో పాటు డ్యూ ప్రభావం ఉండటంతో ఓటమి తప్పలేదన్నాడు. ఇక గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని తెలిపిన రోహిత్.. తదుపరి మ్యాచ్‌ల్లో ఆడుతానని స్పష్టం చేశాడు.
'మాకు ఏ మాత్రం గుర్తుంచుకోదగిన రోజు కాదు. వాస్తవానికి ఈ సీజన్‌లోనే మాకు ఇదో చెత్త ప్రదర్శన. కొన్ని ప్రయోగాలు చేశాం. దురదృష్టవశాత్తు అవి బెడిసికొట్టాయి. త్వరగా వికెట్లు కోల్పోవడం కూడా మమ్మల్ని దెబ్బతీసింది. డ్యూ ప్రభావం ఉంటుందని తమకు తెలుసు. అసలు టాస్‌ను మేం పరిగణలోకి తీసుకోవద్దు అనుకున్నాం. మా హోం గ్రౌండ్ వాంఖడేలో కూడా డ్యూ ప్రభావం ఉంటుంది. కాబట్టి టాస్ ఓడినా మేం అంతగా పట్టించుకోవద్దు అనుకున్నాం. పవర్ ప్లేలో వికెట్లు తీసినప్పుడు డ్యూ ప్రభావం ఉన్నా ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టవచ్చు. ఇది చాలా ఫన్నీ ఫార్మాట్. రాణిస్తూనే ఉండాలి. ఇక లీగ్ దశలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచామని లైట్ తీసుకోవడానికి లేదు. ఈ రోజు చేసిన తప్పిదాలను గుర్తించి తదుపరి మ్యాచ్‌కు సిద్దమవుతాం. గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగడం సంతోషంగా ఉంది. నా తొడ కండరాల గాయం పూర్తిగా నయమైంది. తదుపరి మ్యాచ్‌ల్లో ఆడుతా'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. పొలార్డ్ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... సూర్యకుమార్ యాదవ్ (29 బంతుల్లో 36; 5 ఫోర్లు), ఇషాన్ కిషన్ (30 బంతుల్లో 33; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. సందీప్ శర్మకు 3 వికెట్లు దక్కగా, 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' షాబాజ్ నదీమ్ (2/19) పొదుపుగా బౌలింగ్ చేశాడు. అనంతరం హైదరాబాద్ 17.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 151 పరుగులు సాధించింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (58 బంతుల్లో 85 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్), వృద్ధిమాన్ సాహా (45 బంతుల్లో 58 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అజేయ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చి జట్టును గెలిపించారు.