స్టేడియం బయట బంతి:
ఈ మ్యాచ్‌లో మిస్టర్ 360 ఏబీ డివీలియర్స్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 23 బంతుల్లో ఆఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 33 బంతుల్లో 73 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. డివీలియర్స్ తన ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఆరు సిక్సులు బాదాడు. ఆరు సిక్సులలో ఓ రెండు ఏకంగా స్టేడియం బయటకు వెళ్లాయి. 16వ ఓవర్‌లో కేకేఆర్ పేసర్ కమలేష్ నాగర్‌కోటి వేసిన నాలుగో బంతికి డివీలియర్స్ భారీ షాట్ ఆడగా.. బంతి స్టేడియం బయటకు వెళ్లింది. ఎంతో ఎత్తులో వెళ్లిన బంతి బయట పడింది.

దటీజ్ ఏబీ:
ఏబీ డివీలియర్స్ కొట్టిన ఆ సిక్స్ 86 మీటర్లు వెళ్లింది. అయితే షార్జా మైదానం చిన్నదిగా ఉండడంతో ఏబీ బాదిన బంతి.. రోడ్డుపై వెళుతున్న ఒక కారుకు తగిలింది. దీంతో ఆ కారు నడుపుతున్న వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆపై రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయినట్టు సమాచారం. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోను సిమ్రాన్ అనే ఫ్యాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 'దటీజ్ ఏబీ.. కొడ్తే బంతి బయటపడాల్సిందే', 'ఏబీ స్టేడియంలో కొడితే.. రోడ్డుపై ట్రాఫిక్ జామ్' అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏబీ సిక్సు కొట్టడం వల్లే రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయిందని కొందరు ఫాన్స్ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

7 మ్యాచ్‌లు.. ఐదు విజయాలు:
ఐపీఎల్ 2020లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లాడిన బెంగళూరు ఐదు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. చివరిగా ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఏకంగా నాలుగు గెలవడం గమనార్హం. దాంతో పాయింట్ల పట్టికలోనూ కోహ్లీసేన నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. పాయింట్ల పట్టికలో చాన్నాళ్ల తర్వాత బెంగళూరు తమ జోరు కొనసాగిస్తోంది. దాదాపు గత మూడు సంత్సరాలలో ఇంత దూకుడుగా బెంగళూరు ఆడలేదు. పాయింట్ల పట్టికలోనూ ఎన్నడూ ఎలాంటి జోష్ చూపించలేదు. దీంతో బెంగళూరు ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అంచనాలు లేని వేళ:
బెంగళూరు ఐపీఎల్ 2016 సీజన్‌లో ప్లేఆఫ్‌కి దూసుకెళ్లింది. కానీ టైటిల్‌ని సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి చేజార్చుకుంది. ఆ తర్వాత వరుసగా 2017, 2018, 2019 సీజన్‌లో కనీసం ప్లేఆఫ్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది. అంతేకాదు పాయింట్ల పట్టికలోనూ చిట్టచివరి స్థానంతో నిలిచేందుకు మిగతా జట్లతో కలిసి పోటీపడింది. దాంతో ఈ ఏడాది కోహ్లీ సేనపై ఏ మాత్రం అంచనాలు లేవు. అయితే ఈ ఏడాది అనూహ్య విజయాల్ని అందుకుంటూ పాయింట్ల పట్టికలో దూసుకెళ్తోంది. ఐపీఎల్ 2020 లీగ్ దశలో బెంగళూరు మరో 7 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో కనీసం మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా.. ప్లేఆఫ్‌కి అర్హత సాధించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications

'టీనేజర్లయినా.. ఆ రాక్షసుల్ని అస్సలు వదలొద్దు'










