
న్యూఢిల్లీ: టీమిండియా రన్ మెషిన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ అరుదైన ఘనత ముంగిట నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో అజేయ హాఫ్ సెంచరీ ఫామ్‌లోకి వచ్చిన ఈ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్.. మరో 10 రన్స్ చేస్తే టీ20ల్లో 9వేల పరుగుల మైలురాయిని అందుకోనున్నాడు. తద్వార టీ20ల్లో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా విరాట్ చరిత్ర సృష్టించనున్నాడు. ఓవరాల్‌గా టీ20ల్లో ఈ ఫీట్ సాధించిన ఏడో బ్యాట్స్‌మెన్‌గా నిలవనున్నాడు.
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 181 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 5502 పరుగులు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 5 వేల పరుగుల మైలురాయిని చేరిన రెండో క్రికెటర్‌గా కోహ్లీ ఘనతను అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్లబ్‌లో రైనా, కోహ్లి, రోహిత్ మాత్రమే చేరారు. ఓవరాల్ టీ20ల్లో 270 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. 41.05 యావరేజ్, 134.25 స్ట్రైక్ రేట్‌తో 8990 పరుగులు చేశాడు. ఇందులో ఐదు శతకాలు కూడా ఉన్నాయి.
ఇక టీ20ల్లో 9వేల పరుగుల మైలురాయి అందుకున్న జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్(13296) టాప్‌లో ఉండగా.. కీరన్ పొలార్డ్(10370), షోయబ్ మాలిక్ (9926), బ్రెండన్ మెకకల్లమ్(9922), డేవిడ్ వార్నర్(9451), ఆరోన్ ఫించ్(9148) కోహ్లీ కన్నా ముందున్నారు. కోహ్లీ తర్వాత భారత తరఫు రోహిత్ శర్మ (8818) రన్స్‌తో ఉన్నాడు. ఈ సీజన్‌లో అతను మరో 182 పరుగులు చేస్తే 9కే క్లబ్‌లో చేరనున్నాడు. ఈ ఇద్దరి తర్వాత సురేశ్ రైనా 8000 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.
ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ మరో 8 సిక్స్‌లు కొడితే.. 200 సిక్సర్ల క్లబ్‌లో చేరనున్నాడు. ప్రస్తుతం 192 సిక్స్‌లు బాదిన కోహ్లీ.. నేడు ఢిల్లీతో జరిగే మ్యాచ్ చెలరేగితే ఈ రెండు రికార్డులను అధిగమించవచ్చు. ఇప్పటి వరకూ ఐపీఎల్‌లో భారత్ నుంచి రోహిత్, రైనా, ధోనీ మాత్రమే 200 కంటే ఎక్కువ సిక్సులు కొట్టారు. కోహ్లీ తన ఫామ్‌ను కొనసాగిస్తూ ఈ రెండు రికార్డులను అందుకుంటాడా లేక మరిన్ని మ్యాచ్‌లు తీసుకుంటాడో చూడాలి.